కర్నూలు : భూమికి సంబంధించి ఇరువర్గాలు ఘర్షణ పడి కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో.. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన నర్సింహులు, సోమన్నల మధ్య గత కొన్ని ఏళ్లుగా భూతగాదాలు జరుగుతున్నాయి. దాంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ వాజ్యంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తరచు ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఇరు కుటుంబాలకు
చెందిన వ్యక్తులు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో సోమన్న కొడుకు వెంకటేశ్వర్లు(25) మృతి చెందగా.. నర్సింహులు కొడుకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.