group clashes
-
జనసేనలో గ్రూప్ రాజకీయాలు.. ఘర్షణ!
సాక్షి, అనకాపల్లి: టీడీపీతో పొత్తు మహిమా అని జనసేనలో గ్రూపు రాజకీయాలు బయట పడుతున్నాయి. బుధవారం అనకాపల్లిలో టీడీపీతో జరిగిన సమన్వయ భేటీలో తెలుగు తమ్ముళ్ల సమక్షంలో జనసైనికులు ఘర్షణ పడ్డారు. అనకాపల్లి ఉప్పల చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో టీడీపీ-జనసేన సమన్వయ భేటీ జరిగింది. ఆ సమయంలో టీం జనసేన(దూలం గోపి), పరచూరి భాస్కరరావు వర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం.. తర్వాత ఒక్కసారిగా తోపులాట జరిగింది. మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పరచూరి భాస్కరరావు వర్గంపై దూలం గోపి వర్గం ఫైర్ అయ్యింది. వీళ్లను నిలువరించేందుకు టీడీపీ నేతలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. మొదటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని తెలిసి కూడా టీడీపీ నేతలు విడివిడిగా వాళ్లకు ఆహ్వానం అందించినట్లు సమాచారం. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనకాపల్లి పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఈ రెండు వర్గాలు తన్నుకున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో అప్పుడు పెద్ద గొడవే జరిగింది. ఈ తరుణంలో గ్రూప్ రాజకీయాలకు జనసేనాని పుల్‌స్టాప్ పెట్టకపోవడం, అవి ఇప్పుడు తమతో జరుగుతున్న భేటీలో రచ్చకు దారితీయడంతో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నిజామాబాద్‌లో యువకుల హల్చల్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యువకులు హల్ చల్ చేశారు. స్థానికల ఆదర్శ్ నగర్లో రెండు గ్రూపులకు చెందిన యువకులు ఆదివారం అర్థరాత్రి కత్తులు, ఇనుప రాడ్లతో దాడులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరువర్గాల వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఐదుగురు యువకులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో కూడా యువకులు మరోసారి గొడవకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అస్సత్రికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. ఇరువర్గాల దాడులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను హత్య చేసిందని మొదటి భార్యపై..
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ హత్యకేసుకు సంబంధించి ఇరు వర్గాలకు చెందిన వారు పోలీసుల సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. స్టేషన్ ఎదుట పోలీసులు చూస్తుండగానే ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గంవారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. రుద్రంగి మండలం మానాల అడ్డబోరు తండాకు చెందిన గుగులోతు రాజుకు పదకొండేళ్ల క్రితం మంజులతో వివాహం జరిగింది. పెళ్లై ఇన్నేళ్లైన పిల్లలు పుట్టకపోవడంతో.. మొదటి భార్య అంగీకారంతో రాజు ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యల మధ్య గొడవలు జరగుతుండటంతో.. గత నెల 14న రాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో భర్త కనిపించకపోవడంపై మంజులపై అనుమానాలు ఉన్నాయని రాజు రెండో భార్య, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంజులను స్టేషన్‌కు పిలిపించి విచారించగా తానే భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. విషయం తెలుసుకున్న రెండో భార్య బంధువులు మంజులతో పాటు ఆమె బంధువులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల వారు దాడులు చేసుకున్నారు. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ: ఒకరు మృతి
కర్నూలు : భూమికి సంబంధించి ఇరువర్గాలు ఘర్షణ పడి కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో.. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం మాచాపురం గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహులు, సోమన్నల మధ్య గత కొన్ని ఏళ్లుగా భూతగాదాలు జరుగుతున్నాయి. దాంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ వాజ్యంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తరచు ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఇరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో సోమన్న కొడుకు వెంకటేశ్వర్లు(25) మృతి చెందగా.. నర్సింహులు కొడుకులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.