
సంగారెడ్డి క్రైం: దాబాలో రూ.200 బిల్లు విషయంలో తగాదా ఏర్పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. కొండాపూర్ మండలం తెర్పోల్‌కి చెందిన షాకిర్ మియా(45), చాకలి రాములు, గంగ్యా నర్సింలు పెద్దాపూర్‌లో సిమెంట్ రింగులు కొనుగోలు చేసి, వాటిని వాహనంలో గ్రామానికి తీసుకెళ్తున్నారు.
మార్గమధ్యలో ఆ వాహనం పాడవడంతో షెడ్‌కు తరలించారు. అనంతరం పట్టణ శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీదాబాకు వెళ్లారు. మద్యం సేవించి భోజనం చేశారు. బిల్లు రూ.1,200 కాగా, రూ.వెయ్యి చెల్లించారు. మిగతా రూ.200 వాహనంలో ఉన్నాయని, తీసుకువస్తామని చెప్పినా దాబా యజమాని అశోక్ చౌహాన్‌తోపాటు ఆయన కుమారుడు పూర్తి డబ్బులు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఇది పెద్ద గొడవకు దారి తీయడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలోనే షాకీర్ మియా మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాకీర్‌మియా మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి తరలించేది లేదని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. దాబాపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment