అవనిగడ్డ : ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజిల్లా అవనిగడ్డలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలో.. వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నాంచారయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య ఈశ్వరమ్మకు తీవ్రగాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు విద్యుత్ కార్యాలయం ఎదుట బడ్డీ కొట్టు నిర్వహించడానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.