- సెప్టెంబర్ నుంచి అమ్మిన వారికే వర్తింపు
- అంతకు ముందు అమ్మకున్న రైతులకు మొండి చేయి
- ప్రభుత్వ నిర్ణయంపై రైతుల మండిపాటు
- కేవలం 30 శాతం మందికే మద్దతు వర్తింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతులందరికీ మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాటమార్చింది. కర్నూలు మార్కెట్‌లో పంటను అమ్ముకున్న రైతులకు మాత్రమే సెప్టెంబర్ 1 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంతకు ముందు ఉల్లి అమ్ముకున్న రైతులు నష్టపోనున్నారు. ఖరీప్ ప్రారంభం నుంచి కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు జరిగాయి. కాని సెప్టెంబర్ నుంచి మద్దతు ధర ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో అన్నదాతలు ఆందోళనకు గురువుతున్నారు.
రాష్ట్రంలో ఉల్లి అత్యధికంగా పండించే జిల్లా కర్నూలు. సాధారణ సాగు 20,746 హెక్టార్లు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 25, 500 హెక్టార్లలో సాగైంది. హెక్టారుకు కనీసం పెట్టుబడి వ్యయం రూ.1.20 లక్షల వరకు వస్తుంది. దిగుబడులు 150 క్వింటాళ్ల వరకు వస్తాయి. క్వింటాళుకు కనీసం రూ.1000 ధర ఉంటే రైతులకు పెట్టుబడి వ్యయం తిరిగివస్తుంది. ఖరీప్‌లో సాగు చేసిన ఉల్లి పంట జూలై నుంచి మార్కెట్‌లోకి వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది క్వింటా ధర రూ.50 నుంచి 150 వరకు పలికింది. కర్నూలు మార్కెట్‌కు అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాల రైతులు కూడా పంటను వచ్చారు. సెప్టెంబర్‌తో పోలిస్తే ఆగస్టులో అధికంగా మార్కెట్‌కు ఉల్లి వచ్చింది. ధరలు పడిపోవడంతో ఆగస్టులో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. ఉల్లి ధరలు పడిపోవడంతో ఆగస్టు నెలలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మార్కెట్‌కు వచ్చి ధరలపై రైతులతో చర్చించారు. కనీస మద్దతు ధర ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు జూలై, ఆగస్టు నెలలను పక్కన పెట్టి సెప్టెంబర్ నుంచే మద్దతు ధరలను అమలులోకి తెస్తుండటంపై రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఏడాది పిబ్రవరి 28 వరకు ఇది అమలులో ఉన్నా.. వచ్చే నెల నుంచి మార్కెట్‌కు ఉల్లి రావడం తగ్గతుంది. అంటే కేవలం సెప్టెంబర్, అక్టోబరు నెలలో మార్కెట్‌లో ఉల్లి అమ్ముకున్న రైతులకు మాత్రమే మద్దతు ధర వర్తిస్తుంది.
మార్కెట్‌కు వచ్చే ఉల్లి 60 శాతమే
జిల్లాలో ఉల్లి భారీగా సాగైనా..కర్నూలు మార్కెట్‌కు 60శాతం మాత్రమే వస్తోంది. చాలా మంది రైతులు తాడేపల్లిగూడెంకు వెళ్తున్నారు. కొందరు పొలాల్లోనే దళారులకు అమ్ముకుంటున్నారు. ఆగస్టు చివరి నాటికే 30 శాతం మంది రైతులు కర్నూలు మార్కెట్‌లోనే అమ్ముకున్నారు. దీన్ని బట్టి చేస్తే 30శాతం మంది రైతులకే మద్దతు ధరలు వర్తిస్తున్నాయి. మొన్నటి వరకు రూ.600 ధరతో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల వద్దకే వెళ్లి ఉల్లి కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇండెంటు తక్కువగా ఇస్తుండటంతో 500 మంది రైతులకు కూడా న్యాయం జరుగలేదు. ఆర్థిక భారం తగ్గించుకనేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
అనామత్ అమ్మకాలకు మద్దతు వర్తించదట...
మార్కెట్‌కు ఉల్లి ఎక్కువగా వస్తుండటం, ధరలు పడిపోతుండటంతో వేలంపాట పూర్తి స్థాయిలో జరుగడం లేదు. మార్కెట్ ఉల్లిని తెచ్చిన రైతులు అమ్ముకొని వెళ్లాలంటే రోజులు పడుతుంది. అలాంటి సమయంలో మార్కెట్ కమిటీ అధికారులు అనామత్‌పై కొనుగోళ్లను ప్రొత్సహిస్తారు. అంటే వేలంపాటతో సంబంధం లేకుండా «కొనుగోలు చేయడం, అనామత్ అమ్మకాలు మార్కెట్ కమిటీ బీట్ పుస్తకంలో రికార్డు కావు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు అనామత్‌పై అమ్ముకున్న రైతులకు దక్కని పరిస్థితి ఏర్పడింది. బీట్ పుస్తకం ఆధారంగా మార్కెట్‌లో ఏఏ రైతులు ఏ ధరకు ఎన్ని క్వింటాళ్లు అమ్ముకున్నారనే వివరాలు ఉంటాయి. దీని ద్వారానే రూ.600 కంటే తుక్కవ ధరకు అమ్మకున్న రైతులకు బ్యాలెన్స్ అమౌంటును రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు,
కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు...
మద్దతు ధర కంటే తక్కువకు అమ్మకున్న రైతులకు మిగతా మొత్తాన్ని చెల్లించేందకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్, కన్వీనర్‌గా మార్కెటింగ్ శాఖ ఏడీ, సభ్యులుగా ఉద్యానశాఖ ఏడీ, కర్నూలు మార్కెట్ కమిటీ సెక్రటరీలు ఉంటారు. మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లికి రూ. 250 లభిస్తే మద్దతు ధర ప్రకారం మిగతా రూ.350 ప్రభుత్వం చెల్లిస్తుంది. మద్దతు ధరల నిమిత్తం రూ.20కోట్లు మంజూరు చేసింది.
మార్కెట్‌కు వచ్చి ఉల్లి వివరాలు
జూన్ 322 టన్నులు
జూలై 857 టన్నులు
ఆగస్టు 11562 టన్నులు
సెప్టంబర్ 11027 టన్నులు