ఉల్లి రైతు కుదేలు
Published Mon, Nov 21 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
– మళీ్ల నిలిచిపోయిన ఉల్లి కొనుగోళ్లు
– కనీసం రూ. 3 లక్షల నగదు లేక క్రయ, విక్రయాలు నిలుపుదల
– మార్కెట్ బయటనే తక్కువ ధరలకు అమ్ముకుంటున్న రైతులు
పెద్ద నోట్ల మార్పిడితో ఏర్పడిన నగదు సంక్షోభం నుంచి రైతులు బయటపడ లేకపోతున్నారు. ముఖ్యంగా ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్రంలో ఉల్లి పండే ఏకైక జిల్లా కర్నూలు మాత్రమే. క్రయ, విక్రయాలు కూడా కర్నూలు మార్కెట్‌లోని జరుగుతాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన మరుసటి రోజు నుంచి మార్కెట్ బంద్ కావడంతో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. వారం రోజుల తర్వాత ఉల్లి కొనుగోళ్లు చేపట్టారు. అయితే కనీస అవసరాలకు సైతం డబ్బులు లేవని ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేయలేమని సోమవారం వ్యాపారులు చేతులెత్తేశారు. దీంతో ఉల్లి రైతులు కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి.
- కర్నూలు(అగ్రికల్చర్)
కర్నూలు మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లిని తరలించడానికి కనీస అవసరాలకు అవసరమైన నగదు ఇచ్చేందుకు బ్యాంకులు సహకరించకపోవడంతో లావాదేవీలు మళ్లీ నిలిచిపోయాయి. కొనుగోలు చేసిన ఉల్లిని తరలించేందుకు కనీసం దారి ఖర్చులకు కూడా డబ్బులు లేవంటూ కొనుగోలుదారులు ముందుకు రాలేదు. మరో వైపు మార్కెట్‌లోకి ఉల్లిని అనుమతించకపోవడంతో తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక మార్కెట్ బయటనే అతి తక్కువ ధరలకు అమ్ముకొని వెళ్తున్నారు. వేరుశనగ, పత్తి, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, ఆముదం తదితర పంటల కొనుగోళ్లు ఆలస్యం అయినప్పటికి నష్టం లేదనే ఉద్దేశంతో ప్రస్తుతానికి వీటి గురించి పట్టించుకోవడం లేదు. ఉల్లి పచ్చి సరకు కావడం, అదీ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉందేది కాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లి రైతుల ఇబ్బందులు తీర్చాలని మార్కెట్ కమిటీ చైర్మన్ శమంతకమణి ప్రయత్నిస్తున్నప్పటకి బ్యాంకర్లు సహకరించకపోవడంతో ఉల్లి క్రయ, విక్రయాలు అనిశ్చితిలో పడ్డాయి. జిల్లాలో 12 మార్కెట్ కమిటీలు ఉండగా కేవలం కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్‌ల్లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. నగదు కొరత కారణంగా పెద్ద నోట్లు రద్దు అయిప్పటి నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో రైతులు ఆర్థి«క సంక్షోభంలో చిక్కుకున్నారు.
కనీసం రోజుకు మూడు లక్షలు ఇస్తే.
నగదు కొరతతో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ లావాదేవీలు చేపట్టాలను భావిస్తోంది. ఇందుకు ఉల్లి కొనుగోలు దారులు అనుకూలంగానే ఉన్నారు. రైతులు డబ్బులు ఆలస్యంగా ఇచ్చినా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అయితే కనీస అవసరాలకు డబ్బులు లేకపోవడం సమస్యను జటిలమవుతోంది. కర్నూలు ఉల్లి 80 శాతం వరకు కోల్‌కతకు ఎగుమతి చేస్తారు. మిగిలినది దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. డీజిల్, బాడుగలు చెక్‌ల ద్వారా ఇస్తున్నా లారీలు కర్నూలు నుంచి గమ్యం చేరుకోవాలంటే ఖర్చులకు ఒక్కో లారీకి రూ.10వేల అవసరం అవుతాయి. కర్నూలు నుంచి రోజుకు 30 లారీలు పోతున్నందున రోజుకు రూ.3 లక్షలు బ్యాంకుల ద్వారా సమకూరిస్తే కొనుగోళ్లు చేపడుదామని కొనుగోలు దారులు పేర్కొంటున్నారు. కాని ఇందుకు బ్యాంకర్లు సహకరించడం లేదు. ఇపుడున్న పరిస్థితుల్లో ఆర్‌బీఐ నిబంధనల మేరకు మాత్రమే నగదు ఇస్తామని అదనపు మొత్తం ఇవ్వలేమంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉల్లి కొనుగోళ్ల వ్యవహారం ఆగమ్యగోచరంగా మారింది. నగదు సంక్షోభం రైతులకు నష్టాలను మిగిలుస్తోంది.
అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: శమంతకమణి, కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్
ఉల్లి రైతులు నష్టపోకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. లారీ డ్రైవర్ల దారి ఖర్చులకు రోజు రూ. 3 లక్షలు అవసరమని కోరుతున్నా బ్యాంకర్లు సహకరించడం లేదు. అదీ కూడా 100 నోట్లు అంతకంటే తక్కువ విలువ నోట్లే కావాలని అడుగుతున్నారు. ఉల్లి రైతులు నష్టపోకుండా సహకరించాలని బ్యాంకులను కోరుతున్నా స్పందనలేదు. నిబంధనలకు అనుగుణంగా ఇస్తామని అంతకంటే ఏమీ చేయలేమని చెబుతున్నారు. నగదు కొరతతో ఉల్లి రైతులు సష్టపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను.
Advertisement
Advertisement