
నేను.. బతికే ఉన్నా మహాప్రభో..!
* చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో రికార్డు
* రద్దయినపింఛన్
* లబోదిబోమంటున్న వృద్ధురాలు
రామసముద్రం: బతికి ఉండగానే ఓ వృద్ధ మహిళ చనిపోయినట్లు ఆన్‌లైన్‌లోఅధికారులు రికార్డు చేశారు. దీంతో ఆ వృద్ధురాలి పెన్షన్ ఆగిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందని గజ్జలవారిపల్లె కి చెందిన ఎన్.జహీరాబీ వాపోతున్నారు. ఐడీ నంబరు 42652తో 6400008 ఖాతాతో పెన్షన్ వస్తుండేది.
అయితే ఆరు నెలలుగా పెన్షన్ నిలిపివేశారు. కారణం ఏంటని విచారించగా పెన్షనర్ల జాబితాలో ఆమె చనిపోయినట్లు రావడంతో అవాక్కైంది. ఆరునెలలుగా అధికారులతో విసిగి వేసారిపోయింది. ఈ విషయమై ఎంపీడీవో దయానందంను వివరణకోరగా ఒకే పేరుతో ఇద్దరు మహిళలు ఉండగా, ఒక మహిళ చనిపోవడంతో పొరపాటుగా బతికి ఉన్న ఆమెకు పెన్షన్ ఆగిపోయిందని తెలిపారు. జహీరాబీ దరఖాస్తును తిరిగి ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేసి తిరిగి పెన్షన్ మంజూరు అయ్యేలా చేయిస్తామని తెలిపారు.