
కమిటీలతోనే సరి !
జిల్లా క్షయ వ్యాధి నివారణ సొసైటీలో 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని రెండున్నరేళ్ల క్రితం నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
– ఆరు నెలలైనా భర్తీకి నోచుకోని పోస్టులు
– జిల్లా క్షయ నివారణ సొసైటీలో ఇదీ దుస్థితి
అనంతపురం టౌన్ : జిల్లా క్షయ వ్యాధి నివారణ సొసైటీలో 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని రెండున్నరేళ్ల క్రితం నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇందుకు దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే వాటిని భర్తీ చేయాల్సిన అధికారులు కమిటీలతోనే కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. రెండున్నరేళ్ల క్రితం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేయడంతో మళ్లీ 20 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ఈ ఏడాది మార్చిలో విడుదల చేశారు.
ఏప్రిల్‌లో దరఖాస్తులు స్వీకరించగా 464 మంది దరఖాస్తు చేశారు. అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాయిప్రతాప్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ సుధీర్‌బాబు, జబార్ కో ఆర్డినేటర్ విజయమ్మ, పీఓడీటీటీ సుజాత, పరిపాలన అధికారి భీమానాయక్, సూపరింటెండెంట్ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ అతావుల్లాను స్క్రూటినీ కోసం కమిటీగా ఏర్పాటు చేశారు. అయితే రెండు నెలల క్రితం సాయిప్రతాప్ ఉద్యోగ విరమణ కూడా చేశారు. మిగిలిన కమిటీ ప్రాథమికంగా స్క్రూటినీ చేసింది. అయితే మరోసారి జాబితాను పరిశీలించాల్సిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు కలెక్టర్ కోన శశిధర్‌ను, డీఎంహెచ్‌ఓను కలిసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.వెంకటరమణను సాక్షి వివరణ కోరగా దరఖాస్తుల పరిశీలన జరిగింది. మరోసారి కమిటీని వేసి క్రాస్ చెక్ చేసి మెరిట్ జాబితా విడుదల చేస్తాం అన్నారు.
దరఖాస్తులు వచ్చాయిలా ..!
కేడర్ ఎన్ని పోస్టులు వచ్చిన దరఖాస్తులు
సీనియర్ మెడికల్ ఆఫీసర్ 1 8
జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ 1 45
టీబీ కౌన్సిలర్ 1 42
టీబీ స్టాటిస్టికల్ అసిస్టెంట్ 1 58
సీనియర్ టీబీ సూపర్‌వైజర్ 11 138
టీబీ హెల్త్ విజిటర్ 2 62
ల్యాబ్ టెక్నీషియన్లు 2 93
అకౌంటెంట్ 1 18
మొత్తం 20 464