ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్!
ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్!
Published Thu, Aug 18 2016 9:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
ఇందూరు: బాల కార్మికులను పని నుంచి విముక్తి కల్పించడం.. బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం.. అనాథ పిల్లలకు వసతి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ జిల్లాలో విజయవంతమైంది. జూలై 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కొనసాగిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో చాలా మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తిని కల్పించారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం స్థానంలో ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమాన్ని జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బందితోపాటు పోలీసు, కార్మిక శాఖ అధికారులు పాలు పంచుకున్నారు. ఈ మూడు శాఖల సమన్వయంతో నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ డివిజన్‌లవారీగా నలుగురు సభ్యులు కలిగిన నాలుగు బృందాలు ప్రత్యేక వాహనంలో నెల రోజులపాటు సంచరించారు. ఫ్యాక్టరీలు, వ్యాపార సముదాయాలు, రైల్వే, బస్టాండ్ ప్రాంతాల్లో 93 మంది పిల్లలను పట్టుకున్నారు. ఇందులో బాల కార్మికులు 62, వీధిబాలలు ఒక్కరు, భిక్షాటన చేస్తున్నవారు 13 మంది పిల్లలున్నారు.
వ్యాపారులపై కేసు
జూవైన్ జస్టిస్ చట్టం ప్రకారం పిల్లలతో పని చేయించడం, పనిలో పెట్టుకోవడం నేరం కిందకు వస్తుంది. బాలలతో పని చేయిస్తున్న ఏడుగురు వ్యాపారులకు ఫైన్ వేయడంతోపాటు కేసులు నమోదు చేశారు. వ్యాపారస్తులతో రూ.5,000 నుంచి రూ.20,000 వరకు పిల్లల పేరిట బ్యాంకుల్లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. ఇలా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే వారికి 18 ఏళ్లు నిండిన తరువాత పైచదువులకు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. బాలలను తీసుకెళ్లి వారి తల్లి దండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి బడిలో చేర్పించారు. అలాగే భిక్షాటన, చెత్త కాగితాలు సేకరిస్తున్న పిల్లలను వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలల్లో చేర్పించారు. అనాథ పిల్లలను స్వచ్ఛంద సంస్థల్లో చేర్పించి నివాసంతోపాటు, విద్యను అందిస్తున్నారు. నెల రోజులపాటు కొనసాగిన డ్రైవ్ విజయవంతగా ముగియడంతో బృందాల సభ్యులకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ప్రసంశలు కురిపించారు.
నిరంతరం చేస్తే ఎంతో మేలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ఏడాదితో రెండు పర్యాయాలు నిర్వహించాలి. అయితే ఈ కార్యక్రమాన్ని రెండుసార్లు మాత్రమే కాకుండా నిరంతరంగా కొనసాగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం నాలుగు దఫాలుగా నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ చేపడితే పాఠశాలల్లో పిల్లల డ్రాపౌట్ తగ్గడానికి వీలుందడని, బడిలో చేర్పించిన పిల్లలు మళ్లీ బడికి వెళ్తున్నారో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయమై ఐసీడీఎస్ పీడీ శారదను అడుగగా.. బాల కార్మికులను వ్యాపారస్తులు పనిలో పెట్టుకోవడం చట్ట ప్రకారం నేరం. కేసుల నమోదు, భారీ జరిమానాలు ఉంటాయి. కావున వ్యాపారస్తులు బాలలను పనిలో పెట్టుకోవద్దు. వారిని చదివించడానికి కృషి చేయాలని తెలిపారు.
Advertisement