మన జిల్లాకు ‘నంది’యోగం లేదా? | Our district 'nandiyogam or not? | Sakshi
Sakshi News home page

మన జిల్లాకు ‘నంది’యోగం లేదా?

Published Tue, Jan 10 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

మన జిల్లాకు ‘నంది’యోగం లేదా?

మన జిల్లాకు ‘నంది’యోగం లేదా?

కడప కల్చరల్‌ : మన జిల్లాను కళలకు కాణాచిగా చెబుతారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సురభి నాటక సంస్థకు జన్మనిచ్చిన జిల్లా ఇది. ఇప్పటి వరకు ఇక్కడి నాటక సంస్థలు, నటులు 70కి పైగా ‘నంది’ బహుమతులు సా«ధించారు. నేటికీ ఇక్కడ మరెందరో ప్రతిభామూర్తులు ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాల నిర్వహణకు మన జిల్లాను దూరం పెట్టడం శోచనీయమని జిల్లా రంగ స్థల కళాకారులు, నాటకాభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    రంగ స్థల నాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సినీ, టీవీ రంగాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏటా నంది నాటకోత్సవాలను నిర్వహిస్తోంది. చాలా ఏళ్లు హైదరాబాద్‌లో నిర్వహించాక విశాఖ, విజయవాడల్లో కూడా నిర్వహించారు. నేటికీ అదే పద్ధతి కొనసాగుతోంది. ఇరవై ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క సారి కూడా మన జిల్లాలో ఏర్పాటు చేయలేదు. జిల్లాకు చెందిన కొందరు నాటకాభిమానులు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మన జిల్లాలో నిర్వహించేందుకు డాక్టర్‌ వైఎస్‌ అంగీకరించారు. కానీ ఆయన అకస్మిక మరణంతో ఆ యత్నాలు అక్కడితో ఆగిపోయాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ విషయంపై జిల్లాను పూర్తిగా విస్మరించాయి.
    జిల్లా ప్రజాప్రతినిధుల సహకారం ఏమాత్రం లేకపోయినా ఇక్కడి నాటకరంగ ప్రముఖులు కొందరు మన జిల్లాలో నంది నాటకాల పోటీ నిర్వహణ అంశాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ డిమాండును వినిపించారు. కానీ ‘మీ జిల్లాలో ఈ ఉత్సవాల నిర్వహణకు ఎక్కడా వేదిక లేదని’ అధికారులు కొట్టిపారేశారు. ఇది కాదన లేని సత్యం గనుక, ఆ ప్రయత్నాలు కూడా అక్కడితో వీగిపోయాయి.
ఇతర జిల్లాల్లో
        నంది నాటకోత్సవాలను ఇప్పటికి పలు మార్లు చిత్తూరు (తిరుపతి)లో, రెండు సార్లు కర్నూలులో నిర్వహించారు. సరైన వేదిక ఉందన్న కారణంగా అనంతపురంలో కూడా నిర్వహించేందుకు యత్నాలు సాగుతున్నాయి. కానీ కేవలం మన జిల్లాలో మాత్రమే సరైన వేదిక లేకపోవడంతో ఈ ఉత్సవాలు మనకు దక్కడం లేదు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో కూడా నాటక ప్రదర్శనకు ప్రత్యేకంగా ఏసీ థియేటర్‌ ఉంది. సురభి నాటకం పుట్టిన మన జిల్లాలో మాత్రం ఎక్కడా నాటక ప్రదర్శనకు అనువైన వేదిక లేదన్న విషయం గమనార్హం.
పేరు గొప్పే
        ‘నంది’ ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మన జిల్లాకు 70కి పైగా నంది బహుమతులు వచ్చాయి. పౌరాణిక, సాంఘిక, బాలల విభాగాలలో ఈ బహుమతులు లభించాయి. కానీ ఇప్పటి వరకు నాటక ప్రదర్శనకు అనువైన వేదిక (రంగ స్థలం) జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నది చేదు నిజం. కడపలోని కళాక్షేత్రం ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ గనుక ఆ ఉత్సవాల నిర్వహణకు పనికి రాదు. మున్సిపల్‌ ఆడిటోరియం నాటక ప్రదర్శనకు ఏమాత్రం పనికి రాకుండా నిర్మించారు. మూడు కోట్లు పెట్టి నిర్మించినా ప్రస్తుతం ఇతర సాధారణ కల్యాణ మండపాల స్థాయికి దిగజారింది. ప్రొద్దుటూరులోని కళాక్షేత్రాలు కూడా ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లే కావడంతో నంది పోటీల నిర్వహణకు పనికి రావు. సురభి లాంటి ప్రఖ్యాత నాటక సంస్థకు జన్మనిచ్చిన ఈ జిల్లాలో ఇలాంటి స్థితి ఉండడం గమనార్హం. కళాక్షేత్రాన్ని క్లోజ్డ్‌ థియేటర్‌గా మార్చేందుకు అంచనాల హడావుడి జరిగినా, అది కార్యాచరణ స్థాయికి రాలేదు. ఇంతటి జిల్లాలో కనీసం ఒక్క మంచి నాటక వేదిక లేకపోవడాన్ని నాటక ప్రియులు అవమానంగా భావిస్తున్నారు. అందుకే నంది పోటీల అవకాశం జిల్లాకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప నగరంలోని కళాక్షేత్రం విశాలమైన ప్రాంగణంలో ఉండడం, పార్కింగ్‌ తదితరాలకు స్థలం కూడా ఉండడంతో దీన్ని క్లోజ్డ్‌ థియేటర్‌గా మారిస్తే ప్రతిష్టాత్మకమైన నందిలాంటి పోటీలు నిర్వహించడంతోపాటు ఆదాయం కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుదంటున్నారు. ఇకనైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాభిమానులు నేక్‌నామ్‌ఖాన్‌ కళాక్షేత్రాన్ని క్లోజ్డ్‌ థియేటర్‌గా మార్చేందుకు నడుం కట్టాలని కోరుతున్నారు.
అవమానకరం
        సురభి పుట్టిన జిల్లాలో నేటికీ నాటక ప్రదర్శనకు అనువైన థియేటర్‌ లేకపోవడం అవమానకరం. నాటకరంగ విభాగంలో డిగ్రీలిస్తున్న యోగి వేమన విశ్వవిద్యాలయంలో కూడా సరైన నాటక థియేటర్‌ లేకపోవడం గమనార్హం. అందుకే జిల్లా నాటకరంగ విషయంగా అభివృద్ధి చెందడం లేదు.
– డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, లలిత కళల విభాగం, వైవీయూ
శోచనీయం
 నాటక రంగం విషయంలో జిల్లాకు గొప్ప పేరుంది. కానీ ఇంతటి జిల్లాలో ఒక్కటి కూడా మంచి స్టేజి లేకపోవడం బాధాకరం. రాయలసీమలోని చిన్న పట్టణాల్లో కూడా నంది పోటీలను నిర్వహిస్తున్నారు. మంచి స్టేజీ లేదన్న కారణంతో కడపను పోటీల నుంచి పక్కన పెట్టడం శోచనీయం.
– వైజీ ప్రకాశ్, నాటక రచయిత, నటుడు, దర్శకుడు
కళాక్షేత్రాన్ని ఆధునికీకరించండి
నంది పోటీలలో నటుడిగా బహుమతులు సాధించాను. న్యాయ నిర్ణేతగా వెళ్లాను. కానీ జిల్లాలో సరైన స్టేజీ లేదని ‘సీమ’లోని ఇతర జిల్లాల కళాకారులు అంటుంటే బాధ కలుగుతోంది. నటులు, దర్శకులు అన్ని విభాగాలలో ఎన్నో బహుమతులు సాధించిన మన జిల్లాలో మంచి స్టేజీ అవసరం ఉంది. కనీసం కళాక్షేత్రాన్ని ఆధునికీకరిస్తే మంచిది.
–  మచ్చా నరసింహాచారి, నంది న్యాయ నిర్ణేత, వీరేశలింగం పురస్కార గ్రహీత


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement