16 మండలాల్లో కొనుగోలు కేంద్రాలు
-
మద్దతు ధర అమలు కమిటీ సభ్యుల వెల్లడి
కొడవలూరు : అత్యధికంగా ధాన్యం పండే 16 మండలాల్లో రెండురోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు మద్దతు ధర అమలు కమిటీ సభ్యులు వెల్లడించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం వారు ధాన్యం దళారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడతూ మేలురకం ధాన్యం క్వింటా రూ.1,450లు, సాధారణ రకం క్వింటా రూ.1410కు తగ్గకుండా కొనుగోలుచేయాలన్నారు. కనీస మద్దతు ధర అమలు జరిగేలా చూసేందుకు ప్రత్యేక కమిటీని నియమించడం జరిగిందని, ఈ కమిటీ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వారి వద్ద రైతు సంతకంతో కూడిన ఓచర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆ ఓచర్‌లో కనీస మద్దతు ధర కంటే తగ్గించి కొన్నట్లు ఉంటే కేసులు తప్పవని హెచ్చరించారు. రైతులు కూడా ధాన్యంలో 17 శాతం తేమ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బృంద సభ్యులు ఏజీపీఓ రవి, సీఎస్ డీటీలు కృష్ణప్రసాద్, ప్రమీల, తహసీల్దార్ రామకృష్ణ పాల్గొన్నారు.