హరీశన్నే పెద్ద గౌడ్
♦ మన సంక్షేమానికి నాకంటే ఎక్కువ ఆలోచిస్తరు
♦ కొనియాడిన ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్
గజ్వేల్: ‘కల్లుగీత కార్మికుల కోసం హరీశన్న ఎంతో ఆలోచిస్తడు.. నేను గౌడ సామాజిక వర్గం నుంచే వచ్చిన.. అయినా నాకంటే ఎక్కువ ఆయన మా గురించి ఆలోచన చేయడం సంతోషమనిపిస్తది’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ మంత్రి హరీశ్‌రావును కొనియాడారు. బుధవారం గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో మంత్రి హరీశ్‌రావుతో కలసి ఈత మొక్కలు నాటే కార్యక్రమంలో పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ హరీశ్‌రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. జిల్లాలో పెండింగ్ ఎక్స్‌గ్రేషియాల గురించి ఎప్పుడు నన్ను అడుగుతనే ఉంటడు.. నిజంగా హరీశన్నే మా గౌడ సామాజిక వర్గానికి పెద్ద గౌడ్.. అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అంతకుముందు మొక్కలు నాటుతున్న సందర్భంలో మంత్రులు హరీశ్‌రావు, పద్మారావుల మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. గ్రామానికి చేరుకున్న మంత్రులకు డప్పుచప్పుళ్లు, బోనాలతో అట్టహాసంగా స్వాగతం పలికారు.