పంప్‌హౌజ్ పనులు షురూ
కాళేశ్వరం: కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా మహదేవపూర్ మండలం కన్నేపల్లి ప్రధాన పంప్‌హౌస్ పనులు మొదలయ్యాయి. మే రెండో తేదీన సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. సోమవారం మంథని ఎమ్మెల్యే పుట్ట మధు అధికారికంగా పనులు ప్రారంభించారు. మూడు రోజులుగా మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేశారు. నిర్మాణం జరిగే ప్రదేశంలో పొక్లెయిన్లతో పూడిక తీస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గురువారం వరకు నిర్మాణానికి అవసరమైన భూసేకరణను హడావుడిగా పూర్తిచేసినట్లు తెలిసింది. మొదట 48ఎకరాలు, తరువాత 188 ఎకరాలు భూసేకరణ చేసినట్లు తెలుస్తోంది. కొందరు నిర్వాసితులకు ఎకరానికి రూ. 3లక్షల2వేలు ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో పంప్‌హౌస్ పనులు ముమ్మరం కానున్నాయి. పరిహారం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో భూసేకరణకు నిర్వాసితులు అడ్డు చెబుతుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. మంత్రి హరీశ్‌రావు వచ్చి పరిహారంపై హామీ ఇస్తేనే భూములు ఇస్తామని పట్టుబట్టారు.