ఈసారి నాకేమీ ఓట్లేయక్కర్లేదులే
మహిళలపై ఎమ్మెల్యే పంచకర్ల ఆగ్రహం
ఓట్లు కోసం అప్పుడొచ్చారు.. ఇన్నాళ్లూ ఎందుకు పట్టించుకోలేదు
ఎమ్మెల్యే పంచకర్లను నిలదీసిన మహిళలు
అసహనంతో ఊగిపోయిన ఎమ్మెల్యే
సాక్షి, విశాఖపట్నం/అచ్యుతాపురం : ‘చెప్పిన కాడికి చాలు ఇకనోర్ముయండి..మీరంతా నాకే ఓట్లేశారు మరి.. ఈసారి నాకేమి ఓట్లయ్యక్కర్లేదులే పనిచూసుకోండి’ అంటూ యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మహిళలతో దురుసుగా మాట్లాడారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. యలమంచిలి టౌన్‌లో ఏఎస్సార్‌కాలనీ, మిలట్రీ కాలనీ, యానాద్రికాలనీలను సందర్శించారు.
ఏఎస్సార్‌కాలనీలో మహిళలతో మాట్లాడుతూ పులిహార, బిర్యానీ పొట్లాలు పంపిచాం అందాయాఅని ఆరా తీశారు. పులిహోర,బిర్యానీలతో మా సమస్య పరిష్కారం కాదు. రోడ్లు, కాలువలు నిర్మించి ముంపు సమస్యను పరిష్కరించాలి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చారు. మళ్లీ రావడానికి రెండున్నరేళ్లు పట్టింది. ఇన్నాళ్లు మా సమస్యలు ఎందుకు పట్టించు కోలేదని పలువురు మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పగ్గాలు చేపట్టిన తర్వాత మా సమస్యపట్టించుకుని ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేదికాదని ప్రశ్నించారు.
దీనికి ఎమ్మెల్యే స్పెందిస్తూ ఇప్పుడే మన్సిపాలిటీ సిబ్బందికి చెబుతాను.. కాలువలన్నీ క్లియర్‌చేయించి ముంపులేకుండా చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. మీరు అలాగె చెప్పి వెళ్తారు. ఆ తర్వాత ఆ పనులు జరగవు.. ఇక్కడే ఉండి సమస్య పరిష్కరించాలని ఏఎస్సార్ కాలనీకి చెందిన మళ్ల పార్వతి ఎమ్మెల్యేను నిలదీసింది.
ఇంకా మాట్లాడబోతుంటే ‘చెప్పినకాడికి చాలు ఇకనోర్ముయ్’ అని ఎమ్మెల్యే దురుసుగా గద్ధించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరికాస్త ముందుకెళ్లిన తర్వాత కూడా ఎమ్మెల్యేకు ఇదే రీతిలో మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్నాళ్లు మేం కన్పించ లేదా అంటూ కనక అనే మహిళ నిలదీయగా.. మీకు ముంపులో బతకడం అలవాటే కదా అని ఎమ్మెల్యేపై కూడా అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. దీనిపై కాలనీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకుంటే వినిపించుకోకుండా ఎమ్మెల్యే కసురుకోవడం ఏంటని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి నాకేమీ ఓట్లేయక్కర్లేదులే
Published Wed, Sep 28 2016 8:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement