జీవీఎంసీ పరిధిలో బలవంతంగా వసూళ్లు చేసిన జనసేన నాయకులు
ఆ సొమ్ముతో భారీ ఎత్తున రమేష్‌బాబు జన్మదిన వేడుక ●
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన జనసైనికుల దోపిడీ
పెందుర్తి: ‘ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.1000 చొప్పున ఇవ్వాలి. లేదంటే తర్వాత ఇబ్బందులకు గురవుతారు. మీ కాలనీకి రోడ్లు ఉండవు. ఇతర సౌకర్యాలు రావు’అంటూ జనసేన నాయకులు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈ నెల 13న జరిగిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు జనసేన నాయకులు ఊర్ల మీద పడ్డారు.
జీవీఎంసీ పరిధి పలు వార్డుల్లోని అపార్ట్‌మెంట్‌లు, గ్రూప్ హౌస్‌లతో పాటు వ్యాపారులు, ఇతర వర్గాలకు చెందిన ప్రజల నుంచి నలుగురైదుగురు జనసేన నాయకులు గుంపుగా వెళ్లి వసూళ్లు చేశారు. ఎమ్మెల్యే పుట్టిన రోజుకు మేమేందుకు డబ్బులు ఇవ్వాలని ప్రజలు అనేసరికి బెదిరింపులకు దిగారు. మీ ప్రాంతానికి సౌకర్యాలు లేకుండా చేస్తామని హెచ్చరికలు చేయడంతో చేసేది లేక ప్రజలు డబ్బులు ఇచ్చినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పంచకర్ల పుట్టినరోజు వేడుకల పేరు చెప్పుకుని ఆయా నాయకులు దాదాపు రూ.15 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో సగం కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ల జేబుల్లోనే వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేగా అధికారికంగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకముందే పంచకర్ల అనుచరులు చెలరేగిపోతుండడం గమనార్హం. రానున్న రోజుల్లో జనసేన నాయకుల ఆగడాలు మరెన్ని చూడాలో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ వసూళ్ల పర్వం ఎమ్మెల్యే పంచకర్లకు తెలిసి జరిగిందా.. తెలియకుండా జరిగిందా అన్నదే ప్రశ్నార్థకం.
Comments
Please login to add a commentAdd a comment