ఇంటిని పరిశీలిస్తున్న సీఐ శ్రీధర్
- ఈ ఏడాదిలోనే రెండు దఫాలు వచ్చి వెళ్లినట్లు ప్రచారం
- తాళం వేసి అనుమానాస్పదంగా ఉన్న ఇంటిపై పోలీసుల ఆరా
ఖమ్మం అర్బన్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ నీడలు రోజుకొకటైనా బయటపడుతున్నాయి. రెండో డివిజన్‌లోని పాండురంగాపురంలోనూ అతని స్థావరం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చిపోతుండేవాడని అంటున్నారు. పాండురంగాపురంలోని గ్రామదేవత (బొడ్రాయి) వద్ద ఉన్న ఇంటిని సుమారు పదేళ్ల క్రితమే నయీమ్ కొత్తపల్లి ప్రసాద్ పేరుతో కొనుగోలు చేశాడని, తన సమీప బంధువు వరుసకు పెద్దమ్మ అయ్యే అత్తరున్నీసా, మేనల్లుడు మిన్ను దాంట్లో నివాసం ఉండేవారని చెబుతున్నారు. ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత ప్రహరీ గోడ ఎత్తు పెంచి, అక్కడక్కడ రంధ్రాలు చేయించాడని, వెనుక వైపు భారీగా ఎత్తు పెంచించాడని అంటున్నారు. అప్పుడప్పుడు నయీమ్ కొంతమంది మహిళలతో వచ్చి రెండు, మూడు రోజులు గడిపి వెళ్లే వాడట. ఈ ఏడాది జనవరిలో, రంజాన్‌కు ముందు నయీమ్ ఇక్కడికి వచ్చి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నయీమ్ మృతికి వారం రోజుల ముందునుంచే ఈ ఇంటికి తాళం వేసి ఉంటున్నట్లు చెబుతున్నారు.
ఇక్కడి నుంచే సెటిల్‌మెంట్లు
పాండురంగాపురంలో కొనుగోలు చేసిన ఇంటి నుంచే భూములు, ప్లాట్ల వివాదంలో సెటిల్‌మెంట్లు చేసేవాడని చెబుతున్నారు. ప్రస్తుతం తాళం వేసి, చుట్టూ చెత్తాచెదారంతో ఉన్న ఆ ఇల్లు నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఈ ఇంటిని నయీమ్ కొత్తపల్లి ప్రసాద్ పేరుతో కొనుగోలు చేశాడు. అసలు ఈ ప్రసాద్ ఎవరనేది తేలాల్సి ఉంది. స్థానికుడా, నకిలీ పేరును సృష్టించాడా? అనే దానిపై ప్రచారం సాగుతోంది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ శ్రీధర్ బుధవారం ఆ ఇంటిని పరిశీలించారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది.
వాస్తవం ‘తాళం’ మాటున..
నయీమ్ స్థావరంగా చెప్పుకుంటున్న ఆ ఇంటి తాళం తీస్తేగానీ అసలు విషయం బయటకు రాదు. ఇంట్లో పెద్దమొత్తంలో బంగారు, డబ్బులు, విలువైన పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఇంట్లో ఓ వృద్ధురాలు ఉండేది. మేము వెళ్లిన వెంటనే ఆమె పన్ను చెల్లించేది..’ అని పన్ను వసూలు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల క్రితం ఇంటి లోపల ఎత్తు బేషన్ అమర్చినట్లు ప్లంబర్ పోలీసుల ఎదుట వివరించాడు.