కర్నూలులో పేపరు మిల్లును పునరుద్ధరించాలి
కర్నూలులో పేపరు మిల్లును పునరుద్ధరించాలి
Published Tue, Mar 7 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
– ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి డిమాండ్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలులో రాయలసీమ పేపర్‌మిల్లు ప్రారంభించాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే, సీఈసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి మంగళవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ యువకులు నిరుద్యోగ సమస్యతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలంటే కర్నూలులో ఎస్‌ఆర్‌పీఎం, హిందూపురంలో నిజాం షుగర్స్, గుంతకల్లులో స్పిన్నింగ్ మిల్లు, కడపలో బ్రాహ్మణి స్టీల్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం లేక నిరుద్యోగ భృతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తనకు అవకాశం లభిస్తే ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకొస్తానని తెలిపారు. ఎన్నోరకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాయలసీమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఆయన 100 అబద్ధాలు చెబితే, ప్రస్తుతం రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థి కె.జె.రెడ్డి పరిశ్రమలు స్థాపిస్తానంటూ 150 అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఉద్యమాలు చేస్తే పీడీ యాక్టు, నిరుద్యోగులపై నాసా యాక్టు పెడతామనడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను అణచివేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్రూరత్వం తగ్గించుకోకపోతే ముఖ్యమంత్రి పాలనకు కాలంచెల్లే రోజులొస్తాయని హెచ్చరించారు.
సీమ సమస్యలపై పోరాడతారు..
రాయలసీమ జిల్లాల అభివృద్ధి పాలకులకు పట్టడం లేదని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వ పాలనలో అన్యాయం జరుగుతుందన్నారు. వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుంటూ ఎంతో చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఆయన గెలిస్తే చట్టసభల్లో సీమవాసుల వాణి వినిపించి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, తద్వారా రాయలసీమ వాసులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
అవగాహన కలిగిన అభ్యర్థి అవసరం..
రాష్ట్ర ఎన్జీవోల సంఘం చైర్మన్‌గా పనిచేసిన వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై మంచి అవగాహన ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అభ్యర్థి ఎంతో అవసరమని వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థికి మూడు జిల్లాల పరిధి ఉండటం వల్ల అందర్ని కలుసుకోకపోయినా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామగ్రామాల్లో, ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. ప్రజాసేవా అనుభవం కలిగిన వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల సమస్యలు సునాయాసంగా పరిష్కారమవుతాయని తెలిపారు. నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లందరు ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు శ్రీకర్, వైద్యనాథ్‌రెడ్డి, కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement