తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి | Parents inspired me | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి

Published Thu, Sep 22 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి

తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి

  • ఓరుగల్లు బిడ్డగా గర్విస్తున్నాను
  • క్రీడలతో ఐదు ఖండాలు తిరిగాను
  • ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్‌
  • వరంగల్‌ స్పోర్ట్స్‌ : మా అమ్మ, నాన్న మల్లమ్మ, ఉప్పలయ్య స్ఫూర్తితోనే నేను ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించానని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్‌ అన్నారు. వరంగల్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌, జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నాగపురి రమేష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రమేష్‌ మాట్లాడుతూ ఓరుగల్లు బిడ్డను అయినందుకే తాను ఉన్నతస్థాయికి చేరుకున్నానని తెలిపారు. తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండేందుకు ముందు అమ్మ, నాన్నలు కారణమని, తర్వాత చిన్ననాటి స్నేహితులని చెప్పారు. ప్రభుత్వం అవకాశమిస్తే అథ్లెటిక్స్‌తో పాటు ఇతర క్రీడల కోసం జిల్లాలో అకాడమీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. మూడంచెల క్రీడా విధానంతో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఇంటర్‌లో ఉన్నప్పుడు కనీసం హైదరాబాద్‌కు కూడా వెళ్లేవాడిని కాదని.. క్రీడాకారుడిగా ఇప్పటివరకు ఐదు ఖండాలు తిరిగానని.. క్రీడల గొప్పతనం ఇదేనని చెప్పారు. అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్య తర్వాత ద్రోణాచార్య అవార్డు తాను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేష్‌ వరంగల్‌ బిడ్డగా తెలంగాణ ప్రతిష్టను ఖండాంతరాలకు చాటి చెప్పాడన్నారు. ఆయన అకాడమీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సాయం అందిస్తామన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో నూతన క్రీడాపాలసీని సీఎం కేసీఆర్‌ తీసుకు రానున్నారని చెప్పారు. అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌జిల్లా కార్యదర్శి సారంగపాణి అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో డీఎస్‌డీఓ ఇందిర, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, సబియా సబహత్, బోడ అనయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు గుడిమల్ల రవికుమార్, ఇండ్ల నాగేశ్వర్‌రావు, మార్నేని రవీందర్‌రావు, కాంగ్రెస్‌ నాయకుడు బొద్డిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పింగిళి రమేష్‌రెడ్డి, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌బ్యాడ్మింటన్‌ జాతీయ అంపైర్‌ కొమ్ము రాజేందర్, నాగకిషన్‌, బరుపాటి గోపి, కోచ్‌లు శ్రీమాన్‌, శ్రీధర్, రమేష్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement