ఆసుపత్రిలో ఉరివేసుకుని రోగి ఆత్మహత్య
Published Sun, Oct 2 2016 2:21 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
గుంటూరు మెడికల్: చికిత్స కోసం జ్వరాల ఆసుపత్రిలో చేరిన రోగి బాత్‌రూములో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం జరిగింది. మృతుడి భార్య కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ సుంకరివారితోటకు చెందిన లేళ్ళ రెడ్డియ్య (40) తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో టీబీ వ్యాధి సోకడంతో చికిత్స నిమిత్తం స్థానిక అమరావతి రోడ్డులోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం చేరాడు. వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం అతనికి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. విషయాన్ని రెడ్డియ్యకు, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని రెడ్డియ్య శనివారం మధ్యాహ్నం భోజనం అనంతరం బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి లోపలికి వెళ్లి గడియపెట్టుకున్నాడు. అరగంట సేపు గడిచినా భర్త బయటకు రాకపోయేసరికి భార్య సెక్యూరిటీ సిబ్బందికి విషయం తెలియజేసింది. వారు తలుపులు పగులగొట్టగా లుంగీతో బాత్‌రూమ్ కిటికీకి రెడ్డియ్య ఉరివేసుకుని మృతిచెంది ఉన్నాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవినేని సుధీర్‌బాబు విషయాన్ని పోలీసులకు తెలపగా.. వారు వచ్చి వివరాలు నమోదు చేసుకుని రెడ్డియ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Advertisement
Advertisement