మూడో జిల్లా పెద్దపల్లి | Peddapally third district | Sakshi
Sakshi News home page

మూడో జిల్లా పెద్దపల్లి

Published Fri, Aug 19 2016 5:13 PM | Last Updated on Sat, Jul 6 2019 3:56 PM

మూడో జిల్లా పెద్దపల్లి - Sakshi

మూడో జిల్లా పెద్దపల్లి

  • 10 మండలాలు 7.37 లక్షల జనాభా
  • మరో మూడు కొత్త మండలాలు ఏర్పాటు చేసే యోచన
  • 22న నోటిఫికేషన్‌ వెలువరించాలని సర్కార్‌ నిర్ణయం
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ఏర్పాటు అంశం తెరపైకి రావడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో అధికార, విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలుసహా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలని కోరలేదు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కూడా ప్రతిపాదించలేదు. అధికార యంత్రాంగం సైతం కనీసం ఈ దిశగా  కసరత్తు చేయలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అనూహ్యంగా పెద్దపల్లి జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించడం జిల్లాలో అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఇటు రాజకీయ పార్టీలు, అటు అధికార యంత్రాంగం విస్తుపోతున్నాయి. ఊహించని పరిణామంతో ఆశ్చర్యపోతున్న అధికార, విపక్షాలు పెద్దపల్లి జిల్లాలో ఏయే మండలాలు కలుపుతారు? జిల్లా ఏర్పాటుకు అనువైనదా? లేదా? అనే అంశాలపై చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రేమండ్‌ పీటర్‌ గురువారం మధ్యాహ్నం కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రత్యేక వీడియో కాన్ఫరె¯Œæ్స నిర్వహించి స్పష్టత ఇచ్చారు. రెండు రెవెన్యూ డివిజన్లలోని 10 మండలాలను కలిపి పెద్దపల్లి జిల్లాగా ఏర్పాటు చేయాలని సంకేతాలిచ్చారు. ఈనెల 22న ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్‌ విడుదల చేయాలని నిర్ణయించిందని, శనివారంలోపు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు తెలిసింది. తొలుత ఈ సమావేశానికి జిల్లా రెవిన్యూ అధికారులంతా వెళ్లగా రేమండ్‌ పీటర్‌ వాళ్లందరినీ బయటకు వెళ్లాలని, జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, డీఆర్వోలు మాత్రమే ఉండాలని చెప్పడంతో చేసేదేమీలేక అందరూ వెనుదిరిగారు. ఈ సమావేశంలో రేమండ్‌ కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఆలోచనలను, పెద్దపల్లి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను, ఏయే రెవెన్యూ డివిజన్లు, మండలాలలు కలపాలనే దానిపై స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. అయితే సమావేశంలో పాల్గొన్న అధికారులెవరూ దీనిపై స్పందించడం లేదు. 
    పెద్దపల్లిలో మూడు కొత్త మండలాలు
     పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం 10 మండలాలున్నప్పటికీ కొత్త మండలాలు ఏర్పాటు చేస్తే మరో మూడు అదనంగా చేరనున్నాయి. రామగుండంలో రెండు, పెద్దపల్లిలో ఒక మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవకాశముంటే కమాన్‌పూర్‌ మండలాన్ని కూడా విభజించి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇదే జరిగే పెద్దపల్లి జిల్లాలో చేరే కొత్త మండలాల సంఖ్య నాలుగుకు చేరనుంది. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 57 మండలాలుండగా, అదనంగా 11 కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. సర్కారు నుంచి వచ్చిన సంకేతాల మేరకు మంథని నియోజకవర్గంలోని మూడు మండలాలు(కమాన్‌పూర్, ముత్తారం, మంథని),  పెద్దపల్లిలోని ఆరు మండలాలతోపాటు రామగుండం మండలాన్ని కలిపి జిల్లా ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పది మండలాల్లో ప్రస్తుత జనాభా 7,37,749.  రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడే కొత్త జిల్లాల్లో అతి తక్కువ జనాభా కలిగిన జిల్లా భూపాలపల్లి కాగా,  7,09,418 మంది జనాభాతో నిర్మల్‌ జిల్లా రెండో స్థానంలో నిలవనుంది. ఆ తరువాత స్థానం మాత్రం పెద్దపల్లిదే కాబోతోంది. పెద్దపల్లి రెవిన్యూ డివిజన్‌లో భాగమైన ధర్మారం, వెల్గటూర్‌ మండలాలను కూడా పెద్దపల్లి జిల్లాలోనే కొనసాగించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ...అట్లా చేస్తే జగిత్యాల జిల్లా ఏర్పాటు క్లిష్టతరమవుతుందని అధికారులు చెబుతున్నారు. అట్లాగే మంథని నియోకజవర్గంలోని మిగిలిన 4 మండలాల(మహదేవ్‌పూర్, మల్హర్, కాటారం, మహాముత్తారం)ను సైతం పెద్దపల్లిలోనే కలపాలనే అభిప్రాయాలు అధికారుల్లో వ్యక్తమైనప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం వాటిని భూపాలపల్లి జిల్లాకే కేటాయించాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. మొత్తమ్మీద శుక్రవారం సాయంత్రం లేదా శనివారం నాటికి పెద్దపల్లి జిల్లా ఏర్పాటు ప్రక్రియకు తుదిరూపు వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 22న జిల్లాల ఏర్పాటుపై కచ్చితంగా నోటిఫికేషన్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కూడా చెబుతున్నారు. 
    ఆశ్చర్యం..అసహనం..
     పెద్దపల్లి జిల్లా ఏర్పాటుపై ఆశ్చర్యపోయిన అధికార, విపక్ష నేతలు సీఎం నిర్ణయంపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రామగుండం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తే వాటిని పక్కనపెట్టి పెద్దపల్లిని జిల్లా కేంద్రం చేయడంలో ఆంతర్యమేమిటో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటుపై ప్రకటన వెలువడే వరకు జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలెవరికీ ఈ విషయం తెలియకపోవడం గమనార్హం.  సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుని పెద్దపల్లి జిల్లాను తెరపైకి తీసుకురావడంతో అధికార పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అయినా జిల్లా కేంద్రం చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారు. పెద్దపల్లితో పోలిస్తే రామగుండం లేదా హుజూరాబాద్‌ జిల్లా కేంద్రానికి అనువైన ప్రాంతమని అభిప్రాయపడుతున్నారు. సీఎం ఏ ఉద్ధేశంతో పెద్దపల్లిని జిల్లా కేంద్రం చేయబోతున్నారో అర్ధం కావడం లేదని, జిల్లాల పునర్విభజన అంతా గందరగోళంగా మారిందని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వాపోయారు. 
     ఊహించని అదృష్టం..
    టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి తెచ్చింది. సిరిసిల్ల, జగిత్యాలలను కొత్త జిల్లాలుగా ప్రతిపాదన చేయడంతో రెండు చోట్ల ముఖ్యమంత్రి కూతురు, కుమారుడు ప్రాతినిధ్యం వహించడం ద్వారా పెద్దపల్లి నుంచి జిల్లా ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే నాయకులే కరువయ్యారు. అంతా ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందని అడిగినా ప్రయోజనం ఏముంటుందని నిరాశతో ఇక్కడివారు కనీసం తెల్లకాగితంపై దరఖాస్తు కూడా ప్రభుత్వానికి అందించలేక పోయారు. అనూహ్యంగా సిరిసిల్ల పేరు జిల్లా జాబితా నుంచి తొలగిపోవడం, రామగుండం పేరును పరిశీలించకపోవడంతో కలలో కూడా ఊహించకుండా పెద్దపల్లి జిల్లా జాబితాలో ఎక్కింది. అయితే పెద్దపల్లి జిల్లా కావాలంటూ ఒక కాగితం ముక్క కూడా ఇవ్వలేకపోయామన్న బాధ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఊహించని పరిణామంపట్ల సదరు ఎమ్మెల్యే ఆశ్చర్యపోయినా ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నెల 22న జిల్లా ఖరారు అవుతుందని ఆ మరునాడే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటామని అధికార పార్టీ నాయకులు ప్రకటించారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement