ఇవ్వాలని ‘పింఛనే’ లేదా !
వారం రోజులుగా అందని పింఛనుదారులకు అందని సొమ్ము
మొరాయిస్తున్న సర్వర్లు
పడిగాపులు పడుతున్న లబ్ధిదారులు
రాష్ట్రంలో మన జిల్లాది 12వ స్థానం
ఆలమూరు :జిల్లాలో పింఛన్ల ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. ఎన్‌టీఆర్ భరోసా పేరుతో పంపిణీ చేస్తున్న పింఛన్లు సకాలంలో లబ్ధిదారులకు అందడం లేదు. అధికార పార్టీ పాలకులు పింఛన్ పంపిణీలో గుప్పిస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితికి పొంతన కుదరకపోవడం లబ్ధిదారుల పాలిట శాపంగా పరిణమించింది. పింఛన్‌ను అందుకోవడానికి వచ్చిన సగటు జీవికి ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సర్వర్లు మొరాయించడం, అధికారపార్టీ నాయకులు లేరనే సాకుతో పింఛన్లు నిలిపివేయడం వంటిì æకారణాలు శాపంగా మారాయి.
పింఛన్ల పంపిణీకి వినియోగిస్తున్న బయోమెట్రిక్ యంత్రాలు కూడా కొరత ఏర్పడడంతో అధికారులు నానా పాట్లు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో 5,10,035 వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత కార్మికులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. మంగళవారం సాయంత్రానికి కేవలం 3,81, 511 మాత్రమే పంపిణీ చేశారు.74.80 శాతం జిల్లాలో పంపిణీ చేసి రాష్ట్రంలోని 12వ స్థానంలో నిలిచింది. 94.99 శాతం కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, 89.26 శాతంతో అనంతపురం (ద్వితీయ), నెల్లూరు (88.72) శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా ఐదో తేదీ నాటికే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాల్సి ఉండగా ఇటీవల ఏడో తేదీకి పొడిగించారు. అయినా పంపిణీ చురుగ్గా సాగకపోవడం వల్ల మరో రెండు రోజులు పొడిగించాల్సి వచ్చింది. మంగళవారం జిల్లాలో పింఛన్ ప్రక్రియ దాదాపు జరగలేదనే చెప్పాలి. సర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల అనేక మంది పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడినా, సర్వర్లు సహకరించలేదు. పంచాయతీ కార్యదర్శులు మూడు గంటలకు రావాలని పింఛనుదారులు సూచించారు. మధ్యాహ్నం కూడా సర్వర్ల పరిస్థితిలో మార్పు లేకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది. రోజంతా పింఛన్ల కోసం పడిగాపుల పడ్డ వారంతా ఉసూరు మంటూ వెనుదిరిగారు. జిల్లాలోని తాళ్లరేవు మండలం మంగళవారం సాయంత్రానికి కేవలం 12.02 శాతం మాత్రమే పంపిణీ చేసి ఆఖరిస్థానంలో నిలిచింది. ఇంకా 50 శాతం కూడా పింఛన్లు పంపిణీ చేయలేని మండలాలు ఆరు ఉన్నాయి. వాటిలో రాజోలు (48.87), వై.రామవరం (46.95), ఐ.పోలవరం (44.06), అయినవిల్లి (42.28), ముమ్మిడివరం అర్భన్ (41,51) ఉన్నాయి. ఇకనైనా అధికారులు సత్వరమే దృష్టి సారించి పింఛన్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.