మున్సిపల్ కార్యాలయం ఎదుట చెత్తను దింపి నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
మదనపల్లె రూరల్: మదనపల్లె పట్టణంలో సేకరించిన చెత్తాచెదారంను తమ గ్రామ సమీపంలో డంపింగ్ చేయడంపై తట్టివారిపల్లె, పుంగనూరువాండ్లపల్లె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆదివారం చెత్తను మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం వద్ద దింపి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలోని బాహుదా కాలువలో తొలగించిన చెత్తాచెదారాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి తమ గ్రామాల సమీపంలో డంపింగ్ చేయడం దారుణమన్నారు. మున్సిపాలిటీకి పంచాయతీలో డంపింగ్ యార్డు కేటాయించినా పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను అక్కడకు చేర్చకుండా తమ గ్రామాల్లో దించడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మళ్లీ పట్టణంలోని చెత్తను తీసుకువచ్చి చెరువు, తూముల్లో దించడం దారుణమని మండిపడ్డారు. వెంటనే చెత్తదిబ్బలు తొలగించకుంటే కార్యాలయం ఎదుట గ్రామస్తులంతా ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు.