– బ్యాంకుల్లో పెరిగిన రద్దీ
– ‘సర్దుబాటు’ చేస్తున్న బ్యాంకర్లు
– జిల్లాకు మందకొడిగా నగదు సరఫరా
అనంతపురం అగ్రికల్చర్ : పెన్షన్ డబ్బు కోసం పెన్షనర్లు, వేతనాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, అత్యావసరాల కోసం ఖాతాదారులు తరలిరావడంతో బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు కిటకిటలాడాయి. పెద్దనోట్లు రద్దు చేసి మంగళవారం నాటికి 56 రోజులు పూర్తయ్యింది. అయినప్పటికీ జిల్లా అంతటా నగదు కోసం జనం పోరాటం కొనసాగుతోంది. నగదు సరఫరా మందకొడిగా ఉండటంతో ఈ దుస్థితి ఏర్పడినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. నెల మొదటి వారం కావడంతో పెన్షనర్లకు కష్టాలు తప్పలేదు. అనంతపురం సాయినగర్‌లోని ఎస్‌బీఐ ప్రధానశాఖ వందలాది మందితో కిక్కిరిసిపోయింది. సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో రెండు, మూడు సార్లు లావాదేవీలకు ఆటంకం కలిగింది. అయినా గంటల కొద్దీ జనం ఓపికతో క్యూలో నిల్చుకున్నారు.
ఆంధ్రా, సిండికేట్, కెనరా, ఏపీజీబీ, కార్పొరేషన్, ఎస్‌బీహెచ్ తదితర బ్యాంకుల్లో కూడా రద్దీ ఎక్కువగా కనిపించింది. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకుకు చెందిన కొన్ని శాఖల్లో విత్ డ్రా రూ.24 వేలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని బ్యాంకుల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఇస్తున్నారు. మిగతా అన్ని బ్యాంకుల్లోనూ రూ.10 వేల వరకు ఇస్తున్నారు. నగదు సరఫరా తక్కువగా ఉన్న ఏపీజీబీ, సిండికేట్, మరికొన్ని చిన్నబ్యాంకుల్లో సర్దుబాట్లు చేస్తున్నారు. ఏటీఎంలు అక్కడక్కడ తెరచి ఉంచినా.. నోక్యాష్ బోర్డు తగిలించారు. గత నెలతో పోల్చితే ఏటీఎంల పరిస్థితి కొంత మెరుగైంది.
ఒకేసారి రూ.4,500 విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రకటించినా.. రూ.100, రూ.500 నోట్ల కొరత కారణంగా కొన్ని ఏటీఎంలు రూ.2 వేల నోట్లకే పరిమితమయ్యాయి. చిల్లర సమస్య కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 170 నుంచి 190 ఏటీఎంలు పనిచేసినట్లు లీడ్‌బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు రోజుల్లో నగదు సరఫరా అయ్యే అవకాశం ఉండటంతో 70 నుంచి 80 శాతం ఏటీఎంలు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కాగా.. ఇప్పటివరకు పాతనోట్ల డిపాజిట్లు రూ.2,500 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం. ఒక్క సాయినగర్ ఎస్‌బీఐ ప్రధానశాఖలోనే రూ.550 కోట్ల వరకు పాతనోట్లు డిపాజిట్లు అయినట్లు తెలుస్తోంది. కొత్త కరెన్సీ రూ.1,400 కోట్ల వరకు వచ్చి ఉంటుందని చెబుతున్నారు.
మందకొడిగా నగదు సరఫరా
నోట్ల రద్దు తర్వాత కొత్త నగదు జిల్లాకు మందకొడిగా సరఫరా అవుతోందని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ నుంచి నేరుగా అనంతపురం కేంద్రానికి డబ్బు సరఫరా కావాల్సివున్నా... గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి మీదుగా వస్తుండడంతో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. అక్కడి నుంచి తెచ్చుకునేందుకు వాహనాలు, సెక్యూరిటీ సమకూర్చుకోవడం భారంగా పరిణమించిందని వాపోతున్నారు. ఖాతాదారుల సంఖ్య, బ్యాంకు శాఖలను పరిగణనలోకి తీసుకోకుండా నగదు కేటాయిస్తుండటంతో కొన్ని బ్యాంకుల్లో పరిస్థితి ఏమాత్రమూ మెరుగుపడలేదు.
లాబీయింగ్ చేస్తున్న వాళ్లకే నగదు సరఫరా అవుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ ఆర్బీఐ, మైసూరు ప్రెస్ లేదా బెంగళూరు నుంచి నగదు వచ్చినా ఇబ్బంది ఉండేది కాదని అంటున్నారు. జిల్లా మంత్రులు, కలెక్టర్ లాంటి వారు దృష్టి సారిస్తే కానీ ప్రజలకు కరెన్సీ కష్టాలు తీర్చలేమని స్పష్టం చేస్తున్నారు. స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ)..ఈ రెండు బ్యాంకుల్లోనే 30 నుంచి 40 శాతం మంది ఖాతాదారులు ఉన్నారు. వీటికి కూడా అవసరం మేరకు నగదు సరఫరా కావడం లేదని ఆయా బ్యాంకుల అధికారులే చెబుతున్నారు.
పోటెత్తిన పెన్షనర్లు
Published Wed, Jan 4 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
Advertisement
Advertisement