శ్రీవారి మెట్టు మార్గంలో నడిచివస్తున్న కాలిబాట భక్తులు
సాక్షి,తిరుమల:
తిరుమల శనివారాల్లోని రెండో శనివారం కావటంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో నిండాయి. సాయంత్రం 6 గంటల వరకు రెండు కాలిబాటల్లోనూ సుమారుగా 24 వేల మంది నడిచివచ్చారు. కాలిబాట భక్తులతో నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండాయి. సర్వదర్శనం క్యూలైన్లు కూడా భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో సాయంత్రం ఆరుగంటల వరకూ 61,271 మంది దర్శించుకున్నారు. పెరిగిన రద్దీ వల్ల గదులు ఖాళీ లేవు. అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ భక్తులు గదుల కోసం నిరీక్షించారు. కల్యాణ కట్టల్లోనూ తలనీలాలు సమర్పించేందుకు వేచి ఉండాల్సి వచ్చింది. అదనపు లడ్డూలు పొందేందుకు భక్తులు ఇక్కట్లు చవిచూశారు. హుండీ కానుకలు రూ.2.32 కోట్లు లభించాయి.