ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి
వినాయక్‌నగర్ : ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఎమ్మార్పీఎస్ నేతలు బుధవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా బాధ్యుడు కొక్కెర భూమన్న మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ.. మాటకు కట్టుబడి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. జస్టిస్ రామచందర్ రాజు, ఉషా మెహ్రా కమిషన్ల నివేదికల ప్రకారం వెంటనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని కోరారు. ఆర్టికల్ 341కి సవరణ చేసి, రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలన్నారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని పల్లె గంగారెడ్డి తెలిపారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నాంపల్లి, కార్యదర్శి రాంచందర్, వేముల బలరాం, జిల్లా అధ్యక్షుడు డప్పుల చంద్రయ్య, నేతలు మాదారపు రాములు, సురేశ్, కృష్ణ, రవి, పసుల బాలమణి, పోసాని తదితరులు పాల్గొన్నారు.