గంటగంటకూ పెరుగుతున్న మృతులు...
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘట్ వద్ద మృతుల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతోంది. తొలుత ఒక్కరు, ఆపై ముగ్గురు.. ఆరుగురు.. అంటూ ఇలా మృతుల సంఖ్య ఏకంగా 27కు చేరుకుంది. అనధికారికంగా ఈ సంఖ్య 32కు చేరిందని సమాచారం. భారీగా భక్తులు తరలిరావడం, వారు తొందరపడి గోడదూకడాలు వంటి పనులు చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాటు మొదలైంది. దీంతో భక్తుల మరణాలు గంటగంటకూ పెరిగిపోతున్నాయి.
ఇదిలాఉండగా ఏపీ ప్రభుత్వం పటిష్ట భద్రత చర్యలు చేపట్టలేదంటూ యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నప్పటికీ, మరోవైపు వీఐపీలకు సాఫీగా పుష్కర స్నానం, పూజా కార్యక్రమాలు నిర్వహణ చేస్తుండటం గమనార్హం. టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయడం లేదని అంబులెన్స్ లు అందుబాటులో లేవని అరకొర ఏర్పాట్లపై భక్తులు మండిపడుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిచడంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.