మొక్క.. కాకిలెక్క! | plant..not growth | Sakshi
Sakshi News home page

మొక్క.. కాకిలెక్క!

Published Fri, Aug 5 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

మొక్క.. కాకిలెక్క!

మొక్క.. కాకిలెక్క!

రెండు నెలల్లో 18,25,761 మొక్కలు
– జూలై 29న ఒక్క రోజు 11,70,773 మొక్కలు నాటినట్లు లెక్కలు
– పది శాతం మొక్కలు ఉంటే ఒట్టు
– అధికారుల్లో కనిపించని చిత్తశుద్ధి
– నాటిన మొక్కల సంరక్షణ గాలికి..


కర్నూలు(అగ్రికల్చర్‌):
ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉండాలంటే మొత్తం భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలి. అయితే కర్నూలు జిల్లాలో అడవుల శాతం 19.9 మాత్రమే. అడవులతో పాటు పచ్చదనం తగ్గిపోతుండటంతో జిల్లాలో వరుస కరువు నెలకొంటోంది. ప్రతి సంవత్సరం జూన్‌ నెల నుంచి మొక్కల పెంపకంపై అధికార యంత్రాంగం హడావుడి చేయడం తప్పిస్తే.. వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటోంది. గత రెండు నెలల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18,25,761 మొక్కలు నాటినట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. జూన్‌ 1 నుంచి జూలై 28 వరకు 6,54,988 మొక్కలు నాటగా.. జూలై 29న ఒక్క రోజులో 11,70,773 మొక్కలు నాటినట్లు కాగితాల్లో నమోదయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం–మనం అభాసు పాలవుతోందనేందుకు ఈ లెక్కలే నిదర్శనం. గత ఏడాది 22 లక్షల మొక్కలు నాటినట్లు అధికారుల రికార్డుల్లో ఉంది. ఇందులో ప్రస్తుతం పది శాతం మొక్కలు కనిపిస్తే ఒట్టు. మొక్కలు పెంచడానికే రూ.1.98 కోట్లు ఖర్చు చేశారు. గుంతలు తవ్వడానికి, ట్రాన్స్‌పోర్టుకు, వన మహోత్సవాల నిర్వహణకు చేసిన ఖర్చు మరింత భారీగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే మొక్కల పేరుతో నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది.

ఈ ఏడాది అంతా హడావుడే..
జిల్లాలోని అటవీ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ నర్సరీల్లో ఈ ఏడాది 1.10 కోట్ల మొక్కలు సిద్ధం చేశారు. ఇందులో చిన్నవి మినహాయిస్తే నాటడానికి అనువైనవి 59.68 లక్షలు. మొక్కలు పెంచడానికి రూ.9.90 కోట్లు వ్యయం చేశారు. అయితే మొక్కలు నాటడంలో చేతులెత్తేశారు. హడావుడి చేయడం తప్ప మొక్కలు నాటడంలో చిత్తశుద్ధి లోపించింది. ఆర్భాటంగా 10–15 మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులివ్వడం మినహా నిజంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలనే ఆలోచన కరువయింది. కొన్ని ప్రభుత్వ శాఖలు ఒక్క మొక్క కూడా నాటలేదు. కానీ వేలాది మొక్కలు నాటినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటిస్తుండటం గమనార్హం.  మొక్కలు నాటడానికి ఎన్‌ఆర్‌ఈసీఎస్‌ ద్వారా గుంతలు తవ్వారు. అధికారుల లెక్కల ప్రకారం 15 లక్షల గుంతలు తవ్వగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మీద మొక్కలు పెంపకంలో రూ.25 కోట్ల వరకు ఖర్చు చేయగా ఇందులో 80 శాతం దుర్వినియోగమే.
మొక్కలు నాటడంలో వింతలు ఇలా..
– మార్క్‌ఫెడ్‌ ద్వారా 1,450 మొక్కలు నాటినట్లు సామాజిక వనవిభాగం అధికారులు ప్రకటించారు. వాస్తవంగా మార్క్‌ఫెడ్‌లో ఒక్క మొక్కను నాటిన పాపాన పోలేదు.
– కర్నూలు నగరపాలక సంస్థలో గత ఏడాది 70వేల మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 29న ఒక్క రోజులో∙21,319 మొక్కలు నాటినట్లు లెక్కలు చూపారు. నగరం అంతా వెతికినా పది శాతం మొక్కలు కనిపించవు.
– డీఈఓ, ఆర్‌ఐఓ, డీవీఈఓ పరిధిలోని స్కూళ్లు, కళాశాలల్లో, డిగ్రీ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో 1.11 లక్షల మొక్కలు నాటినట్లు చెబుతున్నారు. వీటిల్లో 10వేల మొక్కలు నాటిన దాఖలాలు కూడా లేవు.
– వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో జూలై 28 వరకే 4,600 మొక్కలు నాటినట్లు చెబుతున్నారు. అయితే ఆ సంఖ్య 500 మొక్కలకు మించలేదని తెలుస్తోంది.
– రెవెన్యూ శాఖలో.. అంటే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, ఆర్‌డీఓ, తహశీల్దార్‌ కార్యాలయాల్లో 5400 మొక్కలు నాటినట్లు లెక్కలు ఉన్నాయి. ఇటీవల కలెక్టర్‌ కార్యాలయంలో 100 మొక్కలు నాటారు. తర్వాత వాటి సంరక్షణను పట్టించుకోవడమే మానేశారు. ఆర్‌డీఓ కార్యాలయాలు, తహశీల్దార్‌ కార్యాలయాల్లో చాలా వరకు మొక్కలు నాటే కార్యక్రమాలే చేపట్టలేదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement