
మంగళవారం ఔటర్ రింగు రోడ్డు సుందరీకరణ పనులపై అధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం కేసీఆర్
- ఔటర్‌కు ఇరువైపులా నందనవనం
- రింగ్‌రోడ్డును పరిశీలించిన సీఎం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రింగ్‌రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచితే, హైదరాబాద్ హరితనగరంగా మారుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మంగళవారం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన.. ఔటర్‌రింగ్‌రోడ్డు ఆసాంతం పరిశీలించారు. ప్రత్యేక బస్సులో కండ్లకోయ నుంచి గచ్చిబౌలి, శంషాబాద్, బొంగ్లూరు, పెద్ద అంబర్‌పేట, ఘట్‌కేసర్ ప్రాంతాల గుండా సాగిన ముఖ్యమంత్రి.. ఔటర్ సుందరీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. నగరానికి మణిహారంగా నిలిచే రింగ్‌రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటడం ద్వారా రాజధానిని పచ్చలహారంగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు.
మొదట కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్‌ను పరిశీలించారు. అటవీ ప్రాంతాన్ని సంరక్షించుకునేందుకు ప్రహరీలను నిర్మించాలని ఆదేశించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లలో ఇంకా ఖాళీ ప్రదేశం ఉందని, వీటిలో కూడా విరివిగా మొక్కలను పెంచాలని సూచించారు. రింగ్‌రోడ్డు పరిసరాల్లో చాలా స్థలం ఉన్నందున.. అందమైన మొక్కలను పెంచడం ద్వారా సుందరీకరించాలని అన్నారు. హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే జనాభా కోటి వరకు ఉంటుందని, ఏటా కనీసం పదిశాతం పెరుగుతోందని, ఈ జనాభాకు తగినట్లుగా లంగ్‌స్పేస్‌లను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
భావితరాల కోసం నగరాన్ని నందనవనం చేయాలన్నారు. ఫారెస్ట్‌బ్లాక్‌ల కింద లక్షా 50వేల ఎకరాల భూమి ఉందని, దీన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారుల దేనని చెప్పారు. నగరంలో భూమి విలువలు పెరుగుతున్నందున.. అటవీ భూములు కూడా అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందని, అధికారులు జాగ్రత్తపడాలన్నారు. ఘట్‌కేసర్‌లో పది లక్షల మొక్కలు పెంచుతున్న నర్సరీని సందర్శించిన కేసీఆర్.. ఈ ఏడాదికే కాకుండా వచ్చే ఏడాది అవసరాలకు అనుగుణంగా మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
రోడ్డు పనుల జాప్యంపై ఆరా
ఘట్‌కేసర్ నుంచి శామీర్‌పేట వరకు ఔటర్‌రింగ్‌రోడ్డు పనులు ఇంకా పూర్తికాకపోవడంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వేలైన్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా రింగ్‌రోడ్డు పనులు ఆలస్యమవుతున్నాయని హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలినీమిశ్రా వివరించారు. 2016 నాటికి ఈ మార్గాన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారికి రింగ్‌రోడ్డు స్వాగత ద్వారం కనుక.. ఆకర్షణీయమైన పూల మొక్కలతో సుందరీకరించాలని ఆదేశించారు.
విజయవాడ-వరంగల్ రోడ్డు మధ్యన ఉన్న మూసీ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం.. అక్కడి నుంచి గండిపేట వరకు 42 కిలోమీటర్ల మేర 40 ఇంటర్వెల్స్‌తో వంతెన నిర్మించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, అటవీ శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్ మిశ్రా, కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, హరితహారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ముఖ్యమంత్రి శంషాబాద్, మహేశ్వరం, బొంగ్లూరు ప్రాంతాల్లో పర్యటన రద్దు కావడంతో టీఆర్ ఎస్ శ్రేణులు నిరాశకు గురయ్యాయి.