- పొలం గట్లపై పెంపకం.. పర్యావరణానికి మేలు
- రైతులకు అదనపు ఆదాయం
- మొక్కల పెంపకంతో బహుళ ప్రయోజనాలు
జగదేవ్‌పూర్: అడవులు అంతరించిపోవడంతో సరైన వర్షాలు లేవు. వర్షాలు సరిగా కురవక వాతావరణం నానాటికీ వేడెక్కిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు జలాశయాలు, చెరువులు, కుంటలు నీరులేక ఎండిపోతున్నాయి. దీంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోం ది. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి రైతు పొలం గట్లపై విధిగా చెట్లు పెంచితే రాబోయే రోజుల్లో వర్షపాతం పెరగడంతో పాటు రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
హరితహారంలో మొక్కలు పంపిణీ
చాలా వరకు ప్రాంతాల్లో రైతులు పంటలు వేసుకుని ఆకాశం వైపు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడా సాధారణ వర్షపాతాలు సైతం నమోదు కాని పరిస్థితి ఉంది. సరిపడా అడవులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మొక్క లు నాటే కార్యక్రమానికి గత ఏడాది శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా ప్రభుత్వం టేకు, తెల్లదుద్ది, వేప, నేరేడు, జామ, దానిమ్మ, నిమ్మ, ఉసిరి, మొక్కలతో పాటు గడ్డిజాతి మొక్కలను పంపిణీ చేస్తుంది. రైతులు పొలం గట్లపై పెంచుకోవడానికి ఈ మొక్కలన్నీ కూడా అనుకూలమైనవే. వీటి వల్ల పంటకు రక్షణ లభిస్తుంది. అటు కొన్ని సంవత్సరాల తర్వాత వాటిపై ఆదాయం కూడా పొందవచ్చు. రైతులు ఖాళీ భూముల్లో మొక్కలు నాటుకోవడం వల్ల పెద్దగా శ్రమ లేకుండానే ఆదాయం అభిస్తుంది. వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల్లో ఎర్ర చందనం, టేకు, సుబాబుల్ లాంటి మొక్కలను ప్రధాన పంటగా సాగు చేసుకోవచ్చు.
పర్యావరణ లాభాలు
రైతులు మొక్కల పెంపకం ద్వారా తనకు తాను ఆదాయం పొందడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు చేసినవారవుతారు. ఒక చెట్టు తన జీవిత కాలంలో రూ. 2.50 నుండి రూ.5 లక్షల విలువ చేసే ఆక్సిజ¯ŒS అందిస్తుంది. విషవాయువులను పీల్చి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. నీటినిల్వ చేయడం, నీటి ఆవిరి ఉత్పాదకత, మేఘాల ఏర్పాటుకు చెట్లు ఎంతో దోహదం చేస్తాయి.
పంటకు కంచె
అడవులు అంతరించిపోవడం మూలంగా అడవి జంతువులు పంట చేలల్లోకి వచ్చి పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పంటలను రక్షించుకోవడానికి చేను చుట్టూ కొన్ని రకాల మొక్కలు పెంచితే ఈ బెడద నుంచి కొంత వరకు ప్రయోజనం ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పంట చుట్టూ స్తంభాలు, కడీలు పాతి ముళ్లకంచె వేస్తుంటారు. దీనికి బదులు ఏక వృక్ష చెట్లు నాటి, వాటికి మూడేళ్ల వయసు వచ్చిన అనంతరం ముళ్ల కంచె వేసుకుంటే చేనుకు పటిష్ట రక్షణ లభిస్తుంది. 25 సంవత్సరాల అవే చెట్ల ద్వారా ఆదాయం పొందవచ్చు.
స్థానికంగానే మొక్కలు లభ్యం
రైతులు స్థానిక నర్సరీల నుండి మొక్కలను పొందవచ్చు. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై చెట్ల పెంపకం చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామంలో ఈజీఎస్ ఎఫ్‌ఏ వద్ద మొక్కల కోసం ముందస్తుగానే పేర్లను నమోదు చేసుకోవాలి. మొక్కల పంపిణీతో పాటు ఈజీఎస్ కూలీలు రైతుల పొలం గట్లపై మొక్కలను నాటుతారు.
మొక్కలు నాటడం ఇలా...
ప్రతి మూడు మీటర్లకు ఒకటి చొప్పున గుంతలు తవ్వాలి. ఇవి ఒకటిన్నర లేదా రెండు అడుగుల లోతు–వెడల్పు ఉండేలా తీయాలి. మొక్కలు నాటే ముందు పశువుల ఎరువును కొంచెం వేసుకోవాలి. మొక్కను ప్లాస్టిక్ కవరు నుండి తీసేటప్పుడు మొక్కల వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా బయటకు తీయాలి. గుంతలో ముందే కొంత మట్టి పోసి తర్వాత మొక్కను పెట్టి చుట్టూ మట్టిని నింపాలి. ఆ తర్వాత గుంత చుట్టూ గట్టిగా రెండు కాళ్లతో తొక్కాలి. అనంతరం నీళ్లు పోయాలి. ఇలా అయితే మొక్క బాగా పెరుగుతుంది.
గట్లపై చెట్లతో ప్రయోజనం
పండ్ల జాతికి చెందిన జామ, నిమ్మ, బొప్పాయి, నేరేడుతో పాటు టేకు, వేప, తెల్లదుద్ది తదితర మొక్కలను ప్రభుత్వం అందిస్తోంది. పొలంలో పంటతో పాటు గట్లపై మొక్కలు పెంచుకుని కొన్ని ఏళ్ల తర్వాత రెండు రకాలుగా ఆదాయం పొందవచ్చు. పండ్ల మొక్కలైన జామ, ఉసిరి, నేరేడు, నిమ్మ ఎత్తు తక్కువగా పెరగడంతో పాటు కాయలు కూడా రెండేళ్లలోనే చేతికి అందుతాయి. టేకు, వేప, తెల్లదుద్ది చెట్లు పదేళ్లలో పెరుగుతాయి. వీటి ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. గట్లపై చెట్టు రైతు భూమి సరిహద్దును గుర్తించడానికి కూడా ఉపయోగపడుతాయి. వర్షాలు తక్కువగా కురిసినప్పుడు పొలంలో నీటి పదును తగ్గకుండా కూడా దోహదం చేస్తాయి.
నేలకోతలను నివారిస్తాయి
పంట సాగు చేసే నేల గట్టు దెబ్బతినకుండా ఆ గట్లపై ఉండే చెట్లు కాపాడతాయి. అలాగే, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు చెట్ల కారణంగా చల్లని వాతావరణం ఏర్పడి పంటకు మేలు కలుగుతుంది. నీటి నిల్వలు తొందరగా వాడిపోవు. పెసర, మినుము, వేరుశనగ, శనగ వంటి పంటలను ఎక్కువగా ఆశించే లద్దెపురుగు, అంక్షిత పురుగులు వంటి వాటికి గట్లపై ఉండే చెట్ల వల్ల అడ్డుకట్ట పడుతుంది. గట్లపై చెట్లను పెంచడం వల్ల పక్షులు చెట్టు కొమ్మలపై గూళ్లు కట్టుకుని ఉండి, చేనును ఆశించే వివిధ పురుగులను తిని మేలు చేస్తాయి.