సాక్షి, రాజమహేంద్రవరం :
డెంగీ, మలేరియా, ఇతర వైరల్ జ్వరాల వల్ల రోగి శరీరంలో తగ్గే ప్లేట్‌లెట్లు స్థానిక ప్రభుత్వాస్పత్రిలోనే లభించనున్నాయి. వీటితోపాటు హిమోఫీలియా, ఎనీమియా వ్యాధిగ్రస్తులకు అవసరమైన క్రయోప్రస్పిటేటివ్, ప్యాకేజ్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ (పీఆర్‌సీబీ) కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న రక్తనిధి కేంద్రంలో పలు గ్రూపుల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. రక్తంతోపాటు బ్లడ్ కాంపోనెంట్స్.. పీఆర్‌సీబీ, క్రయోప్రస్సిటేటివ్, ఫ్రెష్ ప్రేజోన్ ప్లాస్మా ఇప్పటివరకూ అందుబాటులో లేవు. బ్లడ్ కాంపోనెంట్స్ ఏర్పాటుకు అవసరమైన లైసెన్స్ కేంద్ర ఔషధ నియంత్రణ మండలి, రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగాల నుంచి లభించిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్ తెలిపారు. అయితే రక్తం నుంచి వీటిని వేరు చేసేందుకు అవసరమైన యంత్రాలకు సాంకేతిక సమస్య తలెత్తింది. ప్లేట్‌లెట్లు లేకపోవడంతో రోగుల ఇబ్బందులను ‘సాక్షి’ ఈ నెల 1న ‘ప్లేట్‌లెట్లు ఎక్కడ సారూ’ శీర్షికన వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, యంత్రాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను సత్వరమే పరిష్కరించి, ట్రయల్ రన్‌ను నిర్వహించారు.
రూ.60 లక్షలతో ఏర్పాటు
రక్తం నుంచి ప్లేట్‌లెట్లు, ఇతర కాంపోనెంట్లు వేరు చేయడానికి, వాటిని భద్రపరచడానికి అవసరమైన యంత్రాలను అధికారులు ఇప్పటికే సమకూర్చారు. అమెరికా నుంచి అధునాతన యంత్రాలను తెప్పించారు. ప్లేట్‌లెట్లు భద్రపరిచేందుకు –40, –80 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. భవనం, యంత్రాలకు రాజమహేంద్రవరం ఎంపీ రూ.60 లక్షలు సమకూర్చేలా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, సబ్‌కలñ క్టర్ విజయ్‌కృష్ణన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేష్ కిశోర్ కృషి చేశారు. ఈ నిధుల్లో రూ.15 లక్షలు భవన నిర్మాణానికి, రూ.45 లక్షలు యంత్రాల కొనుగోలుకు వెచ్చించారు.
నామమాత్రపు ధరలకే లభ్యం
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స తీసుకునే జ్వరపీడితులకు అవసరమైన ప్లేట్‌లెట్లు ఉచితంగా లభించనున్నాయి. ప్రత్యేక వార్డుల్లో ఉండే వారికి రూ.400లకు సరఫరా చేస్తారు. ఎనిమీయా, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు తక్కువ ధరలకు అవసరమైన బ్లడ్ కాంపోనెంట్లు లభించనున్నాయి.
కళాశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం
విరివిగా రక్తం అవసరమవుతుంది. సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో కళాశాలల్లో రక్త సేకరణ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థుల్లో ఉన్న అపోహలను నివృత్తి చేస్తున్నాం.
– జి.సూర్యనారాయణ, టెక్నికల్ సూపర్‌వైజర్
తక్కువ ధరలకే అందిస్తాం
యంత్రాలు ఏర్పాటు చేసిన తర్వాత కొంత సాంకేతిక ఇబ్బంది వచ్చింది. ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారమైంది. బ్లడ్ నుంచి ప్లేట్‌లెట్లు, ఇతర కాంపోనెంట్లు వేరు చేసే ప్రక్రియ విజయవంతమైంది. తక్కువ ధరలకే అందిస్తాం.
– డా. టి.రమేష్ కిశోర్, సూపరింటెండెంట్. రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి
మోటివేటర్ అవసరం ఉంది
రక్తదానంపై చాలా అపోహలున్నాయి. ప్రతి నాలుగు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యపరంగా మంచిది. కొత్త రక్తం ఉత్పత్తి అయి ఉత్సాహంగా ఉంటారు. దాతలను చైతన్య వంతులను చేయడానికి బ్లడ్ బ్యాంకులో మోటివేటర్ అవసరం ఉంది.
– డా.ఆర్.మాధవి, వైద్యాధికారి, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి