
సాగరశాంతి సమష్టిబాధ్యత: మోదీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘సముద్రజలాలపై శాంతి, సుస్థిరత తీరప్రాంత దేశాలన్నిటి సమష్టి బాధ్యత. ప్రపంచశాంతికి ఇదే కీలకం. ఈ లక్ష్యాన్ని, బాధ్యతను తీరప్రాంత దేశాలన్నీ స్వీకరించాలి.’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సముద్రతీర దేశాలతో వ్యూహాత్మక, సుహృద్భావ సంబంధాలకు ప్రాధాన్యమిస్తామని, ఇందుకోసం ప్రపంచ మొట్టమొదటి మారిటైమ్ సదస్సును ఈ ఏప్రిల్‌లో ముంబైలో నిర్వహించనున్నామని ప్రధాని పేర్కొన్నారు. అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన(ఐఎఫ్‌ఆర్-2016)లో భాగంగా ఆదివారం విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళం అద్భుతరీతిలో ప్రదర్శించిన సాహస విన్యాసాలను ప్రధాని తిలకించారు.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా 51 దేశాల నౌకాదళాలు విశాఖ బీచ్‌రోడ్‌లో అంతర్జాతీయ పరేడ్ నిర్వహించాయి. సాహస విన్యాసాల అనంతరం బీచ్‌రోడ్‌లో అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి నరేంద్రమోదీ ప్రసంగించారు. విశాఖ ప్రజల స్ఫూర్తి అభినందనీయమని, విపత్తుబారిన పడినా 14 నెలల్లోనే ధైర్యంగా తేరుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే....
ఆర్థికాభివృద్ధికి సముద్రాలే మూలాధారం
ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకోవడానికి సముద్రాలు మనకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వాటి నుంచి ఎంతగా ప్రయోజనం పొందుతామన్నది తీరప్రాంత దేశాల సమర్థతపైనే ఆధారపడి ఉంది. ప్రపంచ వాణిజ్యం 90శాతం సముద్రాల ద్వారానే జరుగుతోంది. గత 50 ఏళ్లలో సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం 6 ట్రిలియన్ డాలర్ల నుంచి 20 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. 60శాతం ఇంధన ఉత్పత్తుల రవాణా సముద్రమార్గాల గుండానే సాగుతోంది. అందుకే సముద్రాలు ప్రపంచ శాంతికి, అభివృద్ధికి వారధులుగా నిలవాలి.
సముద్రాలపై సుస్థిర శాంతి సాధించాలి
తీరప్రాంత దేశాల మధ్య రాజకీయ విభేదాలు సమస్యలను మరింత జఠిలం చేస్తాయి. నౌకాయాన స్వాతంత్య్రాన్ని అందరూ గౌరవించాలి. తీరప్రాంత సవాళ్ల విషయంలో పరస్పరం సహకరించుకోవాలి గానీ పోటీపడకూడదు. దేశాల మధ్య సుహృద్భావంతోనే ప్రపంచ శాంతి, సుస్థిరతలను సాధించగలం. అందుకు ఆయా దేశాల నౌకాదళాలు తమవంతు భూమిక నిర్వర్తించాలి. అందుకు అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన చక్కటివేదికగా మారింది. 50 దేశాల నౌకాదళాలు పాల్గొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రపంచ ఆర్థికాభివృద్ధికి కీలకమైన సముద్రాలను 4సవాళ్ల నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అవేంటంటే..
► ప్రపంచ శాంతికి, సుస్థిరతకు భంగం కలిగిస్తున్న సముద్రతల ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. భారతదేశం కూడా సముద్రతల ఉగ్రవాద బాధిత దేశమే.
► సముద్రపు దొంగల ముప్పును పారదోలాలి.
► సునామీ, తుపానులు, ఇతర ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే వ్యవస్థను ఏర్పరచాలి.
► ఇంధన లీకేజీ, వాతావరణ కాలుష్యం వంటి మానవతప్పిదాల నుంచి సముద్రాలను పరిరక్షించాలి.
భారత్ వ్యూహాత్మక భూమిక పోషిస్తోంది: తీరప్రాంత భద్రతలో భారత్ కీలక భూమిక పోషిస్తోంది. 7,500కి.మీ. పొడవైన తీరప్రాంతం ఉన్న భారత్‌కు ఘనమైన సముద్రయాన చరిత్ర ఉంది. సింధు నాగరికత కాలంలోనే గుజరాత్‌లోని లోథాల్‌లో పోర్టు నిర్మించి విదేశీ వర్తకం సాగించింది. హిందూ మహాసముద్రం మధ్యలో కీలక వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటంతోపాటు నౌకాయాన మార్గాల ద్వారా భారత్ మారిటైమ్ భద్రతలో తనవంతు పాత్ర పోషిస్తోంది. జాతీయ భద్రత దృష్ట్యా సముద్రాలపై ప్రత్యేకించి హిందూ మహాసముద్రంలో శాంతి నెలకొల్పడంలో భారత్ ప్రధాన భూమికి పోషిస్తోంది. అందుకోసం రూపొందించిన విజన్ ‘సాగర్(సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ద రీజియన్) మా దృక్పథాన్ని తెలియజేస్తోంది. సముద్రాల మీద ప్రత్యేకించి హిందూ మహాసముద్రంపై భారతదేశ రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాం. తీరప్రాంత దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు నెలకొల్పడానికి ప్రాధాన్యమిస్తాం. గ్లోబల్ మారిటైమ్ సదస్సును ఏప్రిల్ లో ముంబైలో నిర్వహించనున్నాం.
‘మేకిన్ ఇండియా’లో పెద్దపీట
‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, నౌకానిర్మాణ రంగాలకు పెద్దపీట వేశాం. అందుకోసం స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా 80 కోట్ల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. సముద్ర వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తీరప్రాంతాల ప్రగతికి కొత్త ఆర్థిక పునాదులు నిర్మిస్తాం. తీరప్రాంతాలను కేవలం పర్యాటక అభివృద్ధికే పరిమితం చేయాలన్నది మా విధానం కాదు. తీరప్రాంత యువతకు సముద్ర పరిశోధన, మారిటైమ్ పరిశోధన, అభివృద్ధి, పర్యావరణ అనుకూల, మత్స్య పరిశ్రమ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తాం. దాన్ని మా బ్లూ ఎకానమీలో భాగం చేస్తాం. మేకిన్ ఇండియాపై ఫిబ్రవరి 13 నుంచి వారంరోజులపాటు ముంబైలో గ్లోబల్ సదస్సు నిర్వహిస్తున్నాం.