చెట్టుంటేనే మనుగడ
డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): హరితహారంలో జిల్లాలో కోటీ 85 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గతేడాదిలాగే ఈసారీ లక్ష్యాన్ని అధిగమించి, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు సాధించాలని సూచించారు. బుధవారం జిల్లాలో మూడో విడత హరిత హారం కార్యక్రమాన్ని మంత్రి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవనగర్‌లోని సాయిబాబా ఆలయంతో పాటు డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడడం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు.
22 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ప్రతి మనిషి 12 నుంచి 13 మొక్కలు నాటాలన్నారు. జిల్లా జనాభా 15 లక్షలు ఉందని, ప్రతి ఒక్కరూ ఈ ప్రకారం మొక్కలు నాటితే 2 కోట్ల మొక్కలు అవుతాయన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కోటీ 20 లక్షలు టేకు స్టంపులు నాటాలన్నది లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రతి రైతు పేరు నమోదు చేసుకుని, టేకు స్టంపులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కబడిగా నిర్వహించవద్దన్నారు. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కాకుండా, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురియాలంటే చెట్లు ఎక్కువగా ఉండాలన్నారు.
హరిత సంకల్పం తీసుకోవాలి..
హరితహారం ఆశయం మంచిదని, గ్రామ సభల ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. అటవీ సంపదను 35 శాతానికి అభివృద్ధి చేస్తే వర్షం పిలిస్తే వస్తుందన్నారు. సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రభుత్వాధికారులు ప్రతి ఒక్కరూ హరిత సంకల్పం తీసుకోవాలన్నారు.
మొక్కలను సంరక్షించడానికి..
మొక్కలు నాటేందుకు గుంత తవ్వడానికి రూ. 18.75, మొక్క నాటడానికి రూ. 3.60, మొక్కను సంరక్షించడానికి నెలకు రూ. 5 చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీ.గంగాధర్‌గౌడ్, కలెక్టర్ యోగితారాణా, డీఐజీ శివశంకర్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, జేసీ రవీందర్‌రెడ్డి, డీఎఫ్‌వో ప్రసాద్, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, ఎంపీపీ దాసరి ఇందిర, జెడ్పీటీసీ సభ్యురాలు కూరపాటి అరుణ, సర్పంచ్‌లు విజయ, అంజయ్య, ఒలింపిక్ సంఘం జిల్లా చైర్మన్ గడీల రాములు, తహసీల్దార్ శేఖర్, మండల ప్రత్యేకాధికారి భరత్, ఎంపీడీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులతో మొక్కలు నాటించండి
హరితహారం కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటికి కనీసం పది మొక్కలైనా నాటించాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. బుధవారం టీఎస్‌ఎస్‌పీ ఏడో బెటాలియన్‌లో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్.. డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులతో కొంతసేపు ముచ్చటించారు. కలెక్టర్ తమ వద్దకు రావడంతో విద్యార్థినులు ఆమెతో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల ప్రాధాన్యత, హరితహారం లక్ష్యాన్ని తల్లిదండ్రులకు వివరించి, వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. కలెక్టర్ వెంట బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య, ఏసీపీ ఆనంద్‌కుమార్, డిచ్‌పల్లి సీఐ తిరుపతి, ఎస్సై కట్టా నరేందర్‌రెడ్డి, ఇందల్వాయి ఎస్సై రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ప్రతిగ్రామంలో 40 వేల మొక్కలు..
మోపాల్(నిజామాబాద్ రూరల్): హరిత హారంలో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. పాంగ్రా గ్రామంలోని సాయిబాబా మందిరంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్టు అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది మొక్కలు నాటించాలని కోరారు. పంట పొలాల్లో టేకు మొక్కలు నాటాలన్నారు. గీత కార్మికులు ఈత మొక్కలు నాటాలని సూచించారు.