జిల్లాపై మావోయిస్టుల ప్రభావం లేదు
♦ సరిహద్దు నుంచి కార్యకలాపాలు విస్తరించకుండా జాగ్రత్తలు
♦ బంద్ నేపథ్యంలో విస్తృత తనిఖీలు
♦ ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా వెల్లడి
సాక్షి, కొత్తగూడెం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై మావోయిస్టుల ప్రభావం ఎంతమాత్రం లేదని, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వారి కార్యకలాపాలు పెద్దగా లేకపోవడమే ఇందుకు నిదర్శనమని ఎస్పీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఆంధ్ర – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలపరంగా తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి బుధవారం ఆయన ’సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు లేకపోయినా.. ఛత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్నందున అటువైపు నుంచి కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఇవ్వకుండా, ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగాన్ని అనుక్షణం అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలతోపాటు గతంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టామని వివరించారు. మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన ప్రతీసారి శాంతిభద్రతలపరంగా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామో, ఈసారి కూడా అదే రీతిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. బస్సులు, ఇతర వాహనాల ద్వారా జరుగుతున్న రాకపోకలను పరిశీలిస్తున్నామని, అనుమానం ఉన్న ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే అటవీ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, మిషన్ భగీరథ, రహదారుల నిర్మాణం వంటి కార్యకలాపాలు మారుమూల పల్లెల్లో విస్తృతంగా జరుగుతున్నాయని, గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో అక్కడి ప్రజలు మావోయిస్టుల ప్రభావం నుంచి దూరంగా ఉంటున్నారని చెప్పారు.
ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు గిరిజన గ్రామాల్లో పూర్తయితే అక్కడి ప్రజల్లో మరింత మార్పు వచ్చే అవకాశం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. జిల్లాలో ప్రజలతో పోలీసులు స్నేహితులుగా వ్యవహరిస్తారని, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే రీతిలో, ఆపద సమయాల్లో తక్షణం స్పందించే రీతిలో పోలీస్ యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటుందని అన్నారు. ప్రజలకు పోలీసులను మరింత చేరువ చేసేందుకు గల అవకాశాలను అన్వేషించి ప్రజా సంబంధాలను మరింత మెరుగుపర్చుతామని వివరించారు. అనేక సహజ వనరులున్న కొత్తగూడెం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అపారమైన అవకాశాలున్నాయని, జిల్లా అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములమవుతామని చెప్పారు. పోలీస్ అంటే లాఠీ ఎత్తడమే కాదని, ప్రజల అభివృద్ధిని కాంక్షించి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సైతం తమ బాధ్యత అనే భావన ప్రజల్లో కలిగేలా కార్యకలాపాలు చేపడతామని అన్నారు.
అనుక్షణం.. అప్రమత్తం
Published Thu, Nov 3 2016 6:20 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement