దండకారణ్యంలో టెన్షన్ టెన్షన్
చింతూరు : దండకారణ్యంలో ఇటీవల జరిగిన ఏఓబీ ఎన్ కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడంతో ఏజెన్సీ ఒక్కసారిగా వేడెక్కింది. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల కలయికైన దండకారణ్యంలో మావోయిస్టులకు గట్టి పట్టుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా, దంతెవాడ, బస్తర్, కాంకేర్, బీజాపూర్, నారాయణ్‌పూర్ జిల్లాలతో పాటు తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం, భూపాలపల్లి, ఆంధ్రాలోని తూర్పుగోదావరి, విశాఖ, ఒడిశాలోని మల్కనగిరి జిల్లాల్లో బంద్ ప్రభావం వుండే అవకాశముంది. ఈ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు.
దండకారణ్యమే కీలకం
ఏఓబీ ఎన్ కౌంటర్‌తో ఎదురుదెబ్బ తగిలిన మావోయిస్టులకు ఇకపై తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు దండకారణ్యం కీలకంగా మారనుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ, వెంకటాపురం, శబరి, కిష్టారం ఏరియా కమిటీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2010లో చింతల్‌నార్ వద్ద దేశంలోనే అతి పెద్దదాడిని నిర్వహించడం ద్వారా 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోత, సుక్మా జిల్లా కలెక్టర్ అలెక్స్‌పాల్ మీనన్ కిడ్నాప్ వంటి ఘటనల్లో కీలక భూమిక నిర్వహించిన రామన్న, పాపారావు, ఊసెండీ వంటి నాయకులు ప్రస్తుతం దండకారణ్యంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఏఓబీ ఎన్ కౌంటర్‌లో దండకారణ్యానికి చెందిన మావోయిస్టులు కూడా మృతి చెందడంతో ప్రతీకారంగా వారు ఈ ప్రాంతంలో భారీ ఘటనలకు పాల్పడే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా మావోయిస్టులు ఇన్ ఫార్మర్లను టార్గెట్ చేసే అవకాశముండడంతో సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు మావోయిస్టులు, మరోవైపు పోలీసులు అటవీ ప్రాంతాల్లో మోహరించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు.
సరిహద్దుల్లో హై అలర్ట్
బంద్ నేపధ్యంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో హై అలర్ట్ నెలకొంది. మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించేందుకు పోలీసులు భారీ వ్యూహాలతో సమాయత్తమయ్యారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జాయింట్ ఆపరేషన్ల ద్వారా అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.
రవాణా వ్యవస్థకు ఆటంకం
మావోయిస్టుల బంద్ ప్రభావంతో ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్రా, తెలంగాణకు వచ్చే ప్రైవేటు వాహనాల రాకపోకలు తగ్గాయి. జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఏజెన్సీకి వెళ్లే బస్సులను 4వ తేదీ వరకు నిలిపి వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కిరండోల్‌కు వెళ్లే పాసింజర్ రైలును జగ్దల్‌పూర్ వరకు పరిమితం చేయగా బైలాడిల్లా నుంచి ఇనుప ఖనిజం రవాణా చేసే గూడ్స్ రైళ్ల రాకపోకలను రాత్రిపూట నిషేధించారు.