మావోయిస్టుల బంద్: ఏజెన్సీలో హై అలర్ట్
విశాఖపట్నం:
భారీ ఎన్కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు గురువారం బంద్కు పిలుపునివ్వడంతో మన్యంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఏవోబీ కటాఫ్ ఏరియాలో ఈనెల 24న జరిగిన ఎన్కౌంటర్‌లో 30మంది మరణించడంతో మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి అమరవీరులకు నివాళి అర్పించాలని మావోయిస్టులు.. వారి ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో మన్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరంలో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖ, విజయనగరం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్కు వెళ్లే బస్సులు నిలిపివేశారు. సాలూరు బస్టాండ్లో బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేయడంతో కోరాపుట్, జైపూర్, సునాబెడ, రాయ్పూర్ వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీలేరు, పాడేరులో ప్రభుత్వ వాహనాలను పీఎస్లలోనే ఉంచారు. ముంచంగిపుట్టు,పెదబైలు, మాచ్ఖండ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖ, విజయనగరం నుంచి రాయ్గఢ్, కోరాపుట్, మల్కన్గిరి, జైపూర్, సునాబెడ వెళ్లే బస్సులను సాలూరులోనే అధికారులు నిలిపివేశారు. రాజమండ్రిలోని తూర్పు మన్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల బంద్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. చర్ల, వెంకటాపూర్, వాజేడు మండలాలను బస్సు సర్వీసులు నిలిపివేశారు. మావోయిస్టుల బంద్కు మద్దతుగా హైదరాబాద్లోని చర్లపల్లి సెంట్రల్ జైల్లో మావోయిస్టు రాజకీయ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు.
సురక్షిత ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు
బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులను, మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్ టవర్లకు భద్రత కల్పించారు. మన్యంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.