రగులుతున్న మన్యం
నేడు ఏజెన్సీ బంద్
♦ మావోయిస్టుల ఎన్కౌంటర్‌కు నిరసన ఏవోబీలో బలగాల పెంపు
♦ ప్రభుత్వ ఆస్తులు, సెల్‌టవర్లకు భద్రత నిలిచిన అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు
♦ సురక్షిత ప్రాంతాలకు టీడీపీ నేతలు
సాక్షి, విశాఖపట్నం/సీలేరు:
భారీ ఎన్కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు గురువారం బంద్‌కు పిలుపునివ్వడంతో మన్యంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఏవోబీ కటాఫ్ ఏరియాలో ఈనెల 24న జరిగిన ఎన్కౌంటర్‌లో 30మంది మరణించడంతో మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి అమరవీరులకు నివాళి అర్పించాలని మావోయిస్టులు.. వారి ప్రయత్నాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో మన్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
బంద్‌కు సన్నద్ధమైన మావోయిస్టులు
బంద్‌ను విజయవంతం చేయడం కోసం ఏజెన్సీలో గిరిజనులను మావోయిస్టులు చైతన్యం చేస్తున్నారు. బ్యానర్లు కట్టి, కరపత్రాలు వెదజల్లి ప్రచారం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే గిరిజనులకు ఇప్పటికే కార్యాచరణను రూపకల్పన చేసి వివరించారు. మిలీషియా సభ్యుల సహకారంతో విధ్వంసాలకు పాల్పడే అవకాశాలపై చర్చించినట్లు సమాచారం.
ఆందోళనన కలిగిస్తున్న గతం
అగ్రనేతల ఎన్కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకోవడానికి మావోయిస్టులు బంద్‌ను సరైన సందర్భంగా మలుచుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళనన సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలో ఇలాంటి బంద్‌లు జరిగినప్పుడు మావోయిస్టులు పలు అవాంఛనీయ చర్యలకు పాల్పడ్డారు. జీకే వీధి–సీలేరు మధ్య మూడు బస్సులను తగులబెట్టారు. 100 చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని పేల్చేశారు. ముంచింగ్‌పుట్టు, జి.మాడుగుల, దారకొండలో సెల్‌టవర్లు ధ్వంసం చేశారు. ఇప్పుడు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో వారు ఎలాంటి చర్యలకు దిగుతారనే భయం వ్యక్తమవుతోంది.
అప్రమత్తమైన పోలీసులు
మావోయిస్టుల బంద్ నేపధ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్ టవర్లకు భద్రత కల్పించారు. మన్యంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెక్‌పోస్టులు, పోలీస్ స్టేషన్లలో సిబ్బందిని పెంచారు. కూంబింగ్ దళాలను వెనక్కు పిలిపించామని చెబుతున్నప్పటికీ ఇంకా అడవిలోనే బలగాలు ఉన్నాయి. ఏజెన్సీకి వెళ్లే ప్రతి రహదారిలో అన్ని వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ఆర్టీసీ ముందస్తు చర్యలు
ఎప్పుడు ఎలాంటి బంద్‌లు, ఆందోâýæనలు జరిగినా ముందుగా నష్టపోయేది ఆర్టీసీనే. అందుకే ఈసారి పరిస్థితి తీవ్రతను బట్టి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. వైజాగ్ నుంచి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరికి వెళ్లే బస్సు సర్వీసును, పాడేరు నుంచి సీలేరు మీదుగా తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి వెళ్లే బస్సు, విశాఖ నుంచి సీలేరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంకు వెళ్లే బస్సు సర్వీసులను బుధవారం నుంచే నడపడం మానేశారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు బస్సు సర్వీసులు రద్దు చేశారు.
సురక్షిత ప్రాంతాలకు టీడీపీ నేతలు, ఇన్ఫార్మర్లు
తమ వారి చావులకు బదులు తీర్చుకునేందుకు మావోయిస్టులు టీడీపీ నేతలను టార్గెట్ చేసే అవకాశాలున్నట్లు ఇంటిలిజెన్స్ నివేదికలు చెప్పడంతో బంద్ ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మావోయిస్టు హిట్‌లిస్టులో ఉన్నవారికి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే వీరితోపాటు ఈసారి ఇన్ఫార్మర్లకు ప్రమాదం పొంచిఉంది. భారీ ఎన్కౌంటర్ జరగడానికి కోవర్ట్ ఆపరేషనే కారణమని భావిస్తున్న మావోయిస్టులు నమ్మక ద్రోహం చేసిన వారిని శిక్షించే అవకాశాలు లేకపోలేదు. దానిలో భాగంగా పోలీస్ ఇన్ఫార్మర్లపైనా ప్రతీకారం తీర్చుకోవచ్చు. దీంతో వారిని కూడా పోలీసులు అప్రమత్తం చేశారు.