బుసలు కొట్టిన రియల్ మాఫియా
-
మాజీ సైనికుడైన రియల్ వ్యాపారి కిడ్నాప్
-
కారులో తిప్పుతూ చితకబాదిన వైనం
-
ఆస్తులు రాయించుకుని విడుదల
-
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
సాక్షి, రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరంలో రియల్ మాఫియా బుసలు కొడుతోంది. విభజన అనంతరం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరంలో ‘రియల్’ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఓ మాజీ సైనికుడిని కిడ్నాప్ చేసి, బెదిరించి ఆస్తులు రాయించుకుని, అనంతరం విడుదల చేసిన ఉదంతం కలకలం రేపుతోంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని జయశ్రీ అపార్ట్‌మెంట్‌లో మాజీ సైనికుడు అరసాడ శరత్‌కుమార్ కుటుంబం ఉంటోంది. భారత సైన్యంలో 22 ఏళ్ల పాటు పని చేసిన శరత్‌కుమార్ ఉద్యోగ విరమణ తర్వాత స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. భూముల కొనుగోలుకు సంబంధించి పలువురితో ఆర్థిక లావాదేవీలు జరిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది శరత్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారు. ఈ నెల 27వ తేదీ ఉదయం శరత్‌కుమార్ తన ఇంటి బయటకు వచ్చారు. అడ్రస్ కావాలంటూ ఆయన వద్దకు ఇద్దరు ఆగంతకులు వచ్చారు. ఆ వెనుకే మరో నలుగురు వచ్చి శరత్‌కుమార్‌ను బలవంతంగా ఏపీ ఏఎం 0459 ఇన్నోవా వాహనంలోకి ఎక్కించి, కిడ్నాప్ చేశారు. రాజానగరం ప్రాంతంలో తిప్పుతూ ఆస్తులు తమ పేరిట రాయాలని తీవ్రంగా కొట్టారు. ఆస్తులు రిజిస్ట్రేషని చేయకపోతే తన కొడుకును, భార్యను చంపుతామంటూ బెదిరించి రూ.3.5 కోట్ల విలువైన తన ఆస్తులను రాయించుకున్నారని శరత్‌కుమార్ తెలిపారు. ధవళేశ్వరం సర్వే నంబర్ 98/1లో 3.75 ఎకరాలు, హుకుంపేటలో 39 సెంట్లు, కాకినాడలో సర్వే నంబర్ 210/6లోని 615 గజాల భూమిని కిడ్నాపర్లు పిడింగొయ్యి రిజిస్ట్రేషని కార్యాలయంలో బలవంతంగా రిజిస్ట్రేషని చేయించుకున్నారు. అనంతరం శరత్‌కుమార్‌ను మరో వాహనంలో నగర శివారులోని శాటిలైట్ సిటీ ప్రాంతంలో కిడ్నాపర్లు వదిలేశారు.
ఎస్పీకి ఫిర్యాదు
శరత్‌కుమార్ కిడ్నాప్ జరిగిన గంటకు ఆయన కుమారుడు స్థానిక ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషనిలో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి శరత్‌కుమార్ అర్బని ఎస్పీ రాజకుమారిని కలిశారు. తనను కంపెన సత్యనారాయణ, పుచ్చల సాయికిరణ్, పుచ్చల సాయి, డ్రైవర్ ఈశ్వర్‌లతోపాటు మరో 8 మంది కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. ప్రామిసరీ నోట్లు, తెల్లకాగితాలు, వాహనాల ట్రానిఫర్ సెట్లపై తనతో సంతకాలు పెట్టించుకున్నారని పేర్కొన్నారు. పిడింగొయ్యి రిజిస్ట్రేషని కార్యాలయంలో రూ.3.5 కోట్ల విలువైన తన ఆస్తులను రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. అర్బని ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశ్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణమని సీఐ ఆర్.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు.