పోలీసుల చర్య అప్రజాస్వామికం
ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్
గుంతకల్లు: అనంతపురంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ధర్నా సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు విచక్షణరహితంగా విరుచుకుపడడం అప్రజాస్వామికమని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ విమర్శించారు. సోమవారం స్థానిక తిలక్‌నగర్‌లోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పోరాటం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ధర్నాలో శాంతిభద్రలను పరిరక్షించాల్సిన పోలీసులే అమాయక ప్రజలపై లాఠీలు ఝళిపించడం సరికాదన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్న ఎస్పీని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి రాజనాథ్‌సింగ్ ప్రత్యేక దృష్టి సారించి,జిల్లాలో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.