దడఖాస్తులు
♦ దరఖాస్తుల సమర్పణకు భారీ క్యూ
♦ జనసంద్రమైన కలెక్టరేట్ ఆవరణ
♦ లైన్లలో తోపులాట, పోలీసుల లాఠీచార్జి
♦ సొమ్మసిల్లిన నలుగురు, పలువురికి గాయాలు
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జనం కలెక్టరేట్‌కు పోటెత్తుతున్నారు. గ్రేటర్‌లో లక్ష ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం.. వెనువెంటనే జిల్లా యంత్రాంగం దరఖాస్తుల స్వీకరణకు తెరలేపడంతో ఉదయం నుంచే కలెక్టరేట్ జనసంద్రంగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అర్జీదారులు భారీ క్యూలో గంటల తరబడి నిలబడి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. గురువారం అధికసంఖ్యలో జనం రావడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. క్యూలో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో పలువురు గాయపడగా.. నలుగురు సొమ్మసిల్లి పడిపోయారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రెండు పడకగదుల ఇళ్ల కోసం వస్తున్న అర్జీదారులతో కలెక్టరేట్ జాతరను తలపిస్తోంది. గురువారం జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు గాయపడగా.. నలుగురు అక్కడే సొమ్మసిల్లారు. ఈ ఘటనతో అధికారులు దరఖాస్తుల స్వీకరణ నిలిపివేసి గేట్లు వేయడంతో అక్కడున్న జనం పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు కలగజేసుకుని అర్జీదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని కాంపౌండ్ వాల్ లోపలున్న అధికారులకు అందజేశారు.
గేటు ఎదుట నిరసన..
మధ్యాహ్నం తర్వాత దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్ వేయడంతో సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన అర్జీదారులు కొంత గందరగోళంలో పడ్డారు. కార్యాలయం లోపలికి వెళ్లి ఉన్నతాధికారులను కలుస్తామని ముందుకొచ్చిన కొందరిని పోలీసులు అడ్డుకుని బయటకు తోసేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం మూసివేయడంతో పలువురు గేటు ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
తమ నుంచి దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా నినాదాలు చేశారు. అయితే అధికారులు మాత్రం స్థానికంగా వార్డు సభలు, గ్రామ సభలు నిర్వహిస్తామని, అక్కడే దరఖాస్తులు సమర్పించాలని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలకనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెబుతున్నారు.
పది ప్రత్యేక కౌంటర్లు..
గురువారం ఒక్కరోజే 13,840 అర్జీలు హౌజింగ్ అధికారులు స్వీకరించారు. గత ఐదు రోజులుగా సాగుతున్న దరఖాస్తుల జాతరతో ఏకంగా 48,500 మంది అర్జీలు పెట్టుకోవడం గమనార్హం. దరఖాస్తుదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అధికారులు ప్రత్యేకంగా పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. పది మంది సిబ్బంది ఈ కౌంటర్లలో అందుబాటులో ఉండి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఉదయం కార్యాలయం తెరిచేలోపే కలెక్టరేట్ వెనుకభాగంలో రైల్వే స్టేషన్ పార్కింగ్ నుంచి అర్జీదారులు బారులు తీరుతున్నాయి. ప్రస్తుతం కలెక్టరేట్‌లో 48,500 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రతి సోమవారం మండలాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలోనూ ఇళ్లకోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం దాదాపు మంగళం పాడడంతో వీరంత డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఆశిస్తున్నారు. ఇలా మండలస్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మరో 20వేల దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. డబుల్‌బెడ్‌రూం ఇళ్లకోసం జిల్లాలో ఇప్పటివరకు మొత్తంగా 70వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.