పోలీసుల అదుపులో కోదండరామ్
మెదక్: తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఇవాళ చేపడుతున్న బంద్‌కు మద్దతు తెలపడానికి గజ్వేల్ వస్తున్న ఆయనను ములుగు మండలం వంటిమామిడి వద్ద రాజీవ్ రహదారిపై పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో అక్కడే రహదారి పై కూర్చొని నిరసన చేస్తుండటంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
మెదక్ జిల్లాలో కొనసాగుతున్న బంద్
మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల దాష్టీకానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ మినహా రాజకీయ పార్టీలు ఆర్టీసీ బస్సు డిపోల వద్ద ఆందోళన చేపట్టాయి. దీంతో మెదక్, ప్రజ్ఞాపూర్, నారాయణ్‌ఖేడ్, సిద్దిపేట డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి.కాగా, సిద్దిపేటలో బంద్ అనుకూల, వ్యతిరేక వర్గాల వారు ర్యాలీలు చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు. అయితే, బలవంతంగా బంద్ చేయిస్తున్నారనే కారణంతో కొందరు ప్రతిపక్ష నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పట్టణంలో విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. పెట్రోల్ బంక్‌లు మాత్రం మూతబడ్డాయి.