లంచం కేసు నమోదుపై పోలీసుల మల్లగుల్లాలు
Published Wed, Aug 24 2016 12:24 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
ఏలూరు (మెట్రో) : జనన ధ్రువీకరణ పత్రాల కోసం వీఆర్వో లంచం అడిగారని మహిళ ఫిర్యాదుతో అతడిని కలెక్టరేట్‌కు పిలిపించిన కలెక్టర్ భాస్కర్ రూ.5 వేలు ఇచ్చి పని పూర్తి చేయాలంటూ కోరిన ఘటనకు సంబంధించి వీఆర్వో దుర్గారావుపై కేసు నమోదుకు పోలీసులు మల్లగుల్లాలు పడ్డారు. సోమవారం రాత్రి నుంచి దుర్గారావుపై ఏ విధంగా కేసు నమోదు చేయాలనే సమాలోచనలు చేసిన పోలీసులు చివరకు కలెక్టరేట్ తమ పరిధిలోనిది కాదంటూ చేతులెత్తేశారు. ఆర్‌ఐ ఇచ్చిన ఫిర్యాదును ఏలూరు త్రీటౌన్ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో త్రీటౌన్ పోలీసులు సోమవారమే సదరు వీఆర్వోపై రాత్రి 10 గంటల సమయంలో కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్ పొందుపరిచారు.166 ఐపిసి, 7 పీసీఏ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. వీఆర్వోను సుమారు 30 గంటల పాటు పోలీసులు తమ నిర్భందంలో ఉంచుకుని స్టేషన్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. చివరకు వీఆర్వోల సంఘ నేతలు, ఎన్జీవో నాయకుల చర్చల ఫలితంగా పూచీకత్తుపై వీఆర్వోను విడుదల చేశారు.
ఏసీబీ కేసును పోలీసులు ఎలా నమోదు చేస్తారు?
వాస్తవానికి ఒకరు చేసిన ఆరోపణపై వీఆర్వోను కలెక్టరేట్‌కు పిలిపించిన కలెక్టర్ రూ. 5 వేలు ఇచ్చారని, వీఆర్వో తిరస్కరించినా బలవంతంగా ఇచ్చి వెళ్లిపోయారని, వాస్తవానికి ఈ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయాలి కానీ పోలీసులు కేసు నమోదు చేయడం ఏంటని వీఆర్వోల సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. వీఆర్వో లంచం డిమాండ్ చేస్తే సస్పెన్షన్ వేటు వేయకుండా పోలీస్‌స్టేషన్ లో నిర్భందించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement