అయ్యో.. పోలీసన్న!
* మూడు షిఫ్టులు...రెండు టీమ్‌లతో పుష్కర బందోబస్తు
* ఒత్తిడితో అల్లాడుతున్న పోలీసన్నలు
* అమరావతిలో అస్వస్థతకు గురై ఒంగోలు ఎస్‌ఐ మృతి
* పాలకపార్టీ నేతలు, ఉన్నతాధికారుల మధ్య ఉక్కిరిబిక్కిరి
సాక్షి, గుంటూరు: కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్‌లు, దేవాలయాలు, పార్కింగ్ ప్రదేశాలు, పుష్కర నగర్‌లు, ట్రాఫిక్ పాయింట్లు, హైవే హాల్టింగ్ పాయింట్ల వద్ద పోలీసులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వలంటీర్లను బందోబస్తు విధులకు ఉపయోగిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తూ మూడు షిప్టులుగా తమ విధులను నిర్వర్తిస్తుంటే పోలీసు శాఖలో మాత్రం ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా రోజుకు 12 నుంచి 14 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సివస్తోంది. మూడు షిప్టులుగా విభజించినా సిబ్బంది కొరతతో రెండు టీమ్‌లు మాత్రమే ఏర్పాటు చేసి వారినే మూడు షిప్టులలో పనిచేయిస్తున్నారు. దీనికి తోడు వేసవిని తలపిస్తూ ఎండలు విపరీతంగా కాస్తుండడంతో పోలీసులు అలసి, సొమ్మసిల్లి పడిపోతున్నారు. వేలాది వాహనాలు తిరుగుతుండటంతో రోడ్లపై దుమ్ము ధూళి తట్టుకోలేక వ్యాధుల బారిన పడుతున్నారు. రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కనీసం మంచినీరు అందించే ఏర్పాట్లు కానీ, మరుగుదొడ్ల సౌకర్యం కాని లేకపోవడం దారుణమైన విషయం.
తీవ్ర అస్వస్థతకు గురై ఎస్‌ఐ మృతి..
పుష్కరాల విధులు నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా ఒంగోలు పీసీఆర్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు (58) ఈనెల 9వ తేదీన అమరావతికి వచ్చారు. ఈయనకు ధ్యాన బుద్ధ ఘాట్ వద్ద ట్రాఫిక్ విధులు అప్పగించగా ఐదు రోజులపాటు రోడ్లపై విధులు నిర్వహించి తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం కుప్పకూలిపోయారు. దీంతో అధికారులు ఆయన్ను ఒంగోలు పంపగా గంటల వ్యవధిలోనే ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మతిచెందారు. సీతానగరం పుష్కర ఘాట్ వద్ద విదులు నిర్వహిస్తున్న గుంటూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్ సుల్తానా బేగం తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.శుక్రవారం ఒక్కరోజే 15 మంది కానిస్టేబుళ్లు డయేరియా, విషజ్వరాల బారినపడి పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో చికిత్స పొందడం గమనార్హం.
నలిగిపోతున్న సిబ్బంది..
పుష్కరాల సందర్భంగా అధికార పార్టీ నేతలు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తట్టుకోలేక కింది స్థాయి అధికారులు, సిబ్బంది నలిగిపోతున్నారు. మూడు రోజుల క్రితం అమరావతిలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎస్‌ఐ ద్విచక్రవాహనంపై ట్రిపుల్ రైడింగ్‌లో వెళుతున్న యువకులను ఆపి తాళం లాక్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ యువకులు ఎస్‌ఐపై దూషణలకు దిగుతూ దురుసుగా ప్రవర్తించారు. అనంతరం విషయాన్ని వారు ‘చినబాబు’ దాకా తీసుకెళ్లడంతో పాపం... ఆ ఎస్‌ఐపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఇలా అయితే తాము పనిచేయలేమంటూ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.