సీసీ టీవీ ఫుటేజీలో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు అంబేద్కర్ చౌక్ నుంచి ఇందిరా చౌక్ వైపు వెళుతున్న ఎస్‌ఐ ప్రయాణించిన కారు, (ఇన్‌సెట్లో) ఎస్‌ఐ
తాండూరు /యాలాల: జిల్లాలోని యాలాల ఎస్‌ఐ రమావత్ రమేష్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆయన కదలికలపై పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. గత మంగళవారం సాయంత్రం కారులో ఆయన తాండూరు పట్టణంలో ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఏం చేశారు.. ఎవరెవరిని కలిశారనే కోణంలో పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. భార్య గీతతో కలిసి ఎస్‌ఐ (టీఎస్07ఈజీ7082) మారుతి ఆల్టో తెలుపు రంగు కారులో మంగళవారం సాయంత్రం సుమారు 4.52 గంటలకు తాండూరు పట్టణంలోకి ప్రవేశించినట్టు సీసీ టీవీ పుటేజీలో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బస్టాండ్ సమీపంలోని ఓ పండ్ల దుకాణం కారును ఆపారు. అక్కడ పండ్లు కొన్నట్లు, ఆ సమయంలో వెంట వచ్చిన కానిస్టేబుల్ వేణు కూడా ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలో గుర్తించారు. పండ్ల దుకారణం వద్ద సుమారు 9 నిమిషాల పాటు ఆగిన తర్వాత అక్కడి నుంచి.. పండ్ల దుకాణం పక్కన ఉన్న ట్వీల్స్ బట్టల దుకాణం, చైతన్య కళాశాల మార్గం మీదుగా శాంత్‌మహల్ చౌరస్తా వైపు సాయంత్రం 5.01 గంటలకు ఎస్‌ఐ ప్రయాణించిన కారు వెళ్లినట్టు పుటేజీలో గుర్తించారని తెలుస్తోంది. వెళ్లిన మార్గంలోనే కారు తిరిగి సాయంత్రం సుమారు 5.25 గంటలకు అంబేద్కర్ చౌక్ మీదుగా బస్టాండ్ ఫ్లైఓవర్ వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 5 నిమిషాల తర్వాత కారు ఫ్లైఓవర్ వైపు నుంచి అంబేద్కర్ చౌక్ వైపు వస్తుండగా ఆర్టీసీ బస్సులు బయటకు వెళ్లే ప్రవేశ ద్వారం ఎదురుగా ఓ బస్సు రావడంతో ఆగిపోయినట్లు కూడా సీసీ టీవీ పుటేజీలో గుర్తించారు. కాగా.. కారును మళ్లీ స్టార్ట్ చేసుకొని అంబేద్కర్ చౌక్ మీదుగా ఇందిరాచౌక్ వైపు సాయంత్రం సుమారు 5.30 గంటలకు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. ఇలా సీసీ టీవీ పుటేజీల ఆధారంగా ఎస్‌ఐ మంగళవారం పట్టణంలో ఎటు వెళ్లారనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఎస్‌ఐ క్వార్టర్స్‌కు తాళం..
యాలాలలో ఎస్‌ఐ రమేష్ ఉన్న క్వార్టర్స్‌కు పోలీసులు తాళం వేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా కానిస్టేబుల్‌ను బందోబస్తుకు ఏర్పాటు చేశారు. సర్వీసు రివాల్వర్ క్వార్టర్స్‌లోనే ఉండొచ్చనే కోణంలో బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా నిషేధం విధించారు.
సెల్‌ఫోన్ల స్వాధీనం..
ఎస్‌ఐకి చెందిన డిపార్టుమెంట్‌తోపాటు ఆయన వ్యక్తిగత సెల్‌ఫోన్లను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు సెల్‌ఫోన్ల కాల్‌డేటాపై ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు కూపీ లాగుతున్నాయి. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఎస్‌ఐ సెల్‌ఫోన్ల నుంచి ఎవరిరెవరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి, ఎవరు ఫోన్లు చేశారు. ఎస్‌ఎంఎస్ సమాచారాలు కూడా సేకరించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. ఆయన భార్య ఫోన్ కాల్స్‌పై కూడా అధికారులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
అనుమానితులపై నిఘా..
ఎస్‌ఐది ఆత్మహత్య అని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన నేపథ్యంలో దీనికి ఉసిగొల్పిన కారణాలపై పోలీసు అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా పెద్దేముల్, యాలాల మండలాల్లో ఎస్‌ఐతో సంబంధం ఉన్న వ్యక్తులు, అధికారులు, స్నేహితులు, రాజకీయ నాయకుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. కొందరు అనుమానితులను కూడా పోలీసులు పిలిచి విచారిస్తున్నట్టు సమాచారం. వెంట ఉన్న కానిస్టేబుల్ నుంచి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యలు వస్తే ఆయన ఏ ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లేవారనే దానిపైనా ఆరా తీస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా నేపథ్యంలో వేధింపుల వ్యవహారంపైనా అధికారులు దృష్టి సారించారు.