నయీమ్‌కు చెక్ పెట్టేందుకు ‘సెటిల్‌మెంట్’ మార్గం | police used settlement way to check Nayeem | Sakshi
Sakshi News home page

నయీమ్‌కు చెక్ పెట్టేందుకు ‘సెటిల్‌మెంట్’ మార్గం

Published Fri, Aug 12 2016 1:23 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

నయీమ్‌కు చెక్ పెట్టేందుకు ‘సెటిల్‌మెంట్’ మార్గం - Sakshi

నయీమ్‌కు చెక్ పెట్టేందుకు ‘సెటిల్‌మెంట్’ మార్గం

► నమ్మిన బంటుతోనే గ్యాంగ్‌స్టర్‌కు రాయబారం
► ‘ఓ డీల్ ఉంది.. చేద్దాం’ అంటూ పక్కా స్కెచ్
► నయీమ్ రాగానే ‘డీల్’ సెటిల్ చేసిన పోలీసులు
► అధికార పార్టీ నేతలకే నయీమ్ వరుస బెదిరింపులు
► అత్యున్నత రాజకీయ కుటుంబీకులనూ లెక్క చేయని వైనం
► కొన్నేళ్లుగా అతని వ్యవహారాలపై సర్కారు కన్ను
► ఎవరైతే నాకేంటంటూ నయీమ్ చెలరేగడమే చెక్ పెట్టేందుకు తక్షణ కారణం

 
సాక్షి, హైదరాబాద్
: నయీమ్ పోలీసు అధికారులతోనే తెరపైకి వచ్చాడు.. వారి తోడ్పాటుతోనే సెటిల్‌మెంట్లు, దందాలు నడిపాడు.. పోలీసులనే అడ్డుపెట్టుకుని ఎన్నో డీల్స్ చేశాడు.. ఆ రోజున కూడా ఓ డీల్ జరిగింది. నయీమ్‌తో సంబంధాలున్న డీఎస్పీ స్థాయి పోలీసు అధికారే ‘ఓ డీల్ ఉంది.. చేద్దాం’ అని నయీమ్‌ను పిలిచాడు. అలవాటుగానే నయీమ్ సిద్ధమయ్యాడు. ఉదయాన్నే కలుద్దాం రమ్మని ఓ ప్లేస్ చెప్పాడు. సరిగ్గా అనుకున్న సమయానికే కలిశారు.. డీల్ పూర్తయింది.. కానీ ఈసారి డీల్ పూర్తి చేసింది పోలీసులు. ఎన్నో వేల సెటిల్‌మెంట్లు చేసిన నయీమ్‌కు ఇదే ఆఖరి డీల్ అయింది. పోలీసులు పక్కాగా వేసిన స్కెచ్‌లో ఇరుక్కున్న నయీమ్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

పోలీసుల ‘సహకారం’తో ఎంతో కాలంగా చిక్కకుండానే దర్జాగా తిరుగుతున్న నయీమ్ కథ ఒక్కసారిగా ముగిసిపోవడానికి కారణం... అత్యున్నత రాజకీయ కుటుంబీకులనూ లెక్కచేయకపోవడమేనని సమాచారం. కొన్నేళ్లుగా నయీమ్ ఎంతో మంది ప్రజాప్రతినిధులపైనే నేరుగా బెదిరింపులకు, వసూళ్లకు దిగాడు. తన మాట వినకపోతే ఖతం చేస్తాననీ హెచ్చరించాడు. ఇటీవల అధికార పార్టీ ప్రజాప్రతినిధులనూ టార్గెట్ చేయడంతో నయీమ్ చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టడంపై సర్కారు దృష్టి పడింది. తాజాగా తాను డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తులు తాము అత్యున్నత రాజకీయ కుటుంబీకులకు దగ్గరి వారమని చెప్పినా.. ‘ఎవరైతే నాకేంటి..? నాకు కట్టాల్సిందే’నని నయీమ్ బెదిరించడం సర్కారు నిర్ణయం అమల్లోకి రావడానికి ‘ఆఖరు డీల్’గా మారింది..
 
విచ్చలవిడిగా బెదిరింపులు
దాదాపు పదేళ్లకుపైగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చిన నయీం సెటిల్‌మెంట్లు, రియల్ దందాలు, బెదిరింపులు తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెచ్చుమీరాయి. ఒక దశలో ప్రభుత్వానికి సైతం కొరకరాని కొయ్యగా మారాడు. చివరికి రాష్ట్రంలో అత్యున్నత రాజకీయ కుటుంబీకుల పేర్లు చెప్పినా లెక్కచేయని స్థాయికి తెగించాడు. రెండేళ్ల కింద నయీమ్ గ్యాంగ్ చేతిలో హతమైన టీఆర్‌ఎస్ నేత కోనపురి రాములు కూడా.. హత్యకు ముందు తనకు ప్రాణభయముందని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి వెళ్లి పలుమార్లు ముఖ్యమంత్రికి గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. రాములు హత్య తర్వాత నల్లగొండ జిల్లాలో కొందరు నేతలకు నయీమ్ అంటే భయం పెరిగింది. తర్వాత ఎమ్మెల్యేలు రామలింగారెడ్డిని, శేఖర్‌రెడ్డిని చంపుతామని నయీమ్ బెదిరించిన విషయాన్ని పార్టీ నాయకులు సందర్భం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ‘అప్రమత్తంగా ఉండండి.. అవసరమైతే కొంతకాలం ఎటైనా వెళ్లండి..’ అంటూ అధికార పార్టీ ముఖ్యులు సర్దిచెప్పినట్లు తెలిసింది. అయినా అధికార పార్టీ నేతలకే బెదిరింపులు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
 
అన్నం ఎలా తింటావో చూస్తా!
‘నయీమ్ ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు. బయట తిరగలేకపోతున్నాం.. మమ్మల్ని సైతం బెదిరిస్తున్నాడు.. కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంటే వాడికి లెక్క లేదు..’ అని ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచే నయీమ్ ఆగడాలపై పోలీసు యంత్రాంగం ఓ కన్నేసి ఉంచింది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీని రూ.25 కోట్లు ఇవ్వాల్సిందిగా నయీమ్ డిమాండ్ చేశాడు. ‘ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా..’ అని బెదిరించాడు.

రాష్ట్రంలో ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాలున్న మరో పారిశ్రామికవేత్తను రూ.75 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ రెండు ఘటనలు కూడా అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించాయి. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ రాజకీయ నేతలనూ నయీమ్ లెక్కచేయలేదు. ఇలా గత రెండేళ్లలో పదుల సంఖ్యలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నయీమ్ బాధితుల జాబితాలో చేరిపోయారు. నయీమ్ ఆగడాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
 
ఎవరైతే నాకేంటి?
ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యుడిని నయీమ్ ముఠా డబ్బులు డిమాండ్ చేసింది. అదే సమయంలో యాదగిరిగుట్ట ప్రాంతంలో ఓ రియల్టర్‌ను టార్గెట్ చేసి, కోట్లాది రూపాయలు డిమాండ్ చేసింది. ఈ రెండు ఘటనల్లోనూ వారు డబ్బులు చెల్లించకుండా... అత్యున్నత రాజకీయ కుటుంబీకులు తమకు తెలుసని, తమ జోలికి రావద్దని నయీమ్ గ్యాంగ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తన హెచ్చరికలను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో స్వయంగా రంగంలోకి దిగిన నయీమ్... ‘ఎవరైతే నాకేంటి.. డబ్బులు కట్టాల్సిందే..’ అని ఫోన్లో బెదిరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం రియల్ వర్గాల్లో హల్‌చల్ కావడంతో ఏకంగా సీఎం దృష్టికి వెళ్లినట్లు ప్రచారంలో ఉంది. దీంతో నయీమ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని అత్యున్నత స్థాయి నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పోలీసు యంత్రాంగం హుటాహుటిన నయీమ్ వేటకు రంగం సిద్ధం చేసింది. పేరుకు అజ్ఞాతంలో ఉంటున్నా నయీమ్ రెండేళ్లుగా హైదరాబాద్‌లోనే నాలుగు వాహనాల కాన్వాయ్‌లో తిరుగుతూ దర్జాగా దందా సాగిస్తున్న తీరు పోలీసు యంత్రాంగానికి సవాలు విసిరింది. అతనికి సహకరిస్తున్న పోలీసులతోనే ఎర వేయించిన అధికారులు.. పథకం ప్రకారం నయీమ్‌ను ఖతం చేశారు. తమకు ఆదేశాలు అందిన 48 గంటల వ్యవధిలోనే ఈ ఆపరేషన్‌ను చక్కబెట్టారు. మరోవైపు నయీమ్ ఎన్‌కౌంటర్ జరిగిన రోజున అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆనందంలో మునిగితేలడం గమనార్హం. ‘పీడ విరగడైంది. ఇప్పటికే ఆలస్యమైంది.. ప్రభుత్వం ఇంతకాలం వేచి ఉండాల్సింది కాదు..’ అని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement