కేంద్రాల తనిఖీకి వెళ్లని అధికారులు
సొంత పనులకు వాహనాల వినియోగం
దుర్వినియోగమవుతున్న ప్రభుత్వ ధనం
ఖమ్మం కమాన్‌బజార్ : అంగన్‌వాడీ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. కేంద్రాల పర్యవేక్షణ కోసం సమకూర్చిన వాహనాలను సొంతానికి వాడుకుంటూ.. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 3,299 అంగన్‌వాడీ, 1,006 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా గర్భిణులు, పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం, పాలు, గుడ్లు, వన్ ఫుల్ మీల్స్ సకాలంలో అందించాలి. అయితే ఆయా కేంద్రాలకు కాంట్రాక్టర్లు సరుకులు సక్రమంగా చేరవేస్తున్నారా.. అవి గర్భిణులు, బాలింతలు, బాలబాలికలకు సక్రమంగా అందుతున్నాయా.. లేదా.. అనే విషయాలను ఐసీడీఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. కేంద్రాల పర్యవేక్షణ కోసం సూపర్‌వైజర్లు, వారిపై పర్యవేక్షణ కోసం జిల్లావ్యాప్తంగా 20 ప్రాజెక్టుల పరిధిలో.. 20 మంది సీడీపీఓలు పనిచేస్తున్నారు. వీరు ప్రతీ నెల సెక్టార్ మీటింగ్‌లు నిర్వహించడం..
అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించడం, సూపర్‌వైజర్ల పనితీరును తెలుసుకోవడం చేయాలి. ఇందుకోసం వారికి ప్రభుత్వం సమకూర్చిన వాహనాలను వినియోగించుకోవాలి. కానీ.. 20 మంది సూపర్ వైజర్లలో ఎక్కువ మంది జిల్లా కేంద్రం, మరికొందరు ఏపీలోని కృష్ణా జిల్లా, మరికొందరు ప్రాజెక్టు పరిధిలో నివాసం ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో ఉండే వారు వారి పరిధిలో ఉండే కేంద్రాలను పర్యవేక్షణ చేయగా.. జిల్లా కేంద్రానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు, పక్క జిల్లాల నుంచి వచ్చిపోయే వారు మాత్రం తూతూ మంత్రంగా ఒకసారి ప్రాజెక్టుకు వెళ్లి సంతకాలు చేసి వస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన వాహనాలను సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
రూ.లక్షలు వృథా..
ప్రతీ సీడీపీఓకు ఒక కారు చొప్పున మొత్తం 20 మందికి 20 కార్లను సమకూర్చారు. ప్రతీ అధికారి నెలకు 2,500 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. నెలకు రూ.24వేల బిల్లు చెల్లిస్తారు. ఇలా కారు బిల్లులు ప్రతీ నెలకు రూ.4.8లక్షల చొప్పున చెల్లిస్తారు. కానీ.. పలువురు సీడీపీఓలు మాత్రం వారి ప్రాజెక్టు పరిధిలో పర్యవేక్షించకుండా.. కార్లను సొంత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఏ అధికారి ఎక్కడ పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని చూడాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ డ్యూటీలు సక్రమంగా చేయకుండా.. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసే అధికారులపై చర్య తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
విచారణ చేస్తాం..
సీడీపీఓలు కొందరు స్థానికంగా ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాహనాలు ఏర్పాటు చేసింది అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించేందుకే. వాటిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు. ప్రభుత్వ వాహనాలను శాఖాపరమైన కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. అలా కాకుండా సొంత పనులకు వినియోగించే వారిపై విచారణ చేపడతాం. సీడీపీఓలు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. - జ్యోతిర్మయి, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి