నువ్వా.. నేనా
♦ అధికార పార్టీ వర్సెస్ పోలీసులు
♦ భగ్గుమన్న విభేదాలు
♦ టీఆర్‌ఎస్‌ను ఖాతరు చేయని పోలీసులు
♦ జిల్లాలో గులాబీ దండుకు గడ్డు పరిస్థితి
♦ ఖేడ్ ఉపఎన్నికతో మొదలు
♦ డీజీపీ పర్యటనతో పెరిగిన అంతరం
♦ సిద్దిపేట పురపోరుతో తారస్థాయికి
♦ మంత్రి హరీశ్ విస్మయం
పంతం.. నీదా.. నాదా? అన్నట్టుగా ఉంది జిల్లాలో పోలీసులు, అధికార పార్టీ నేతల తీరు. ఈ మధ్య అధికార పార్టీకి, పోలీసులకు ఏ మాత్రం పొసగడం లేదు. రోజురోజుకూ అంతరం పెరిగిపోతోంది.
అధికార పార్టీ నేతలపై పోలీసులు ఒంటికాలిపై లేస్తున్నారు. చాలాకాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు తాజాగా తారస్థాయికి చేరాయి. సీఎం సొంత జిల్లాలోనే పోలీసులు గులాబీ దండును టార్గెట్ చేశారన్న ఆరోపణలున్నాయి. పోలీస్ బాస్ సైతం అధికార పార్టీ నేతలను ఖాతరు చేయడం లేదని తెలుస్తోంది. ఖేడ్ ఉపఎన్నిక మొదలుకొని డీజీపీ పర్యటన.. తాజాగా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు వ్యవహరించిన తీరు టీఆర్‌ఎస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఎందుకిలా జరుగుతోందో అంతుబట్టక అధికార పార్టీ నేతలు సతమతమవుతున్నారు. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
జిల్లా పోలీసులు, గులాబి దళానికి మధ్య రోజురోజుకూ అంతరం పెరిగిపోతోంది. ఎంతగా అంటే.. పోలీసు ఉన్నతాధికారి తీరును తప్పుబడుతూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. నారాయణఖేడ్ అసెంబ్లీ ఉపఎన్నిక, సిద్దిపేట పురపోరు లో జిల్లా పోలీసులు గులాబీ దండుకు మూడు చెరువుల నీళ్లు తాగిం చారు. బుధవారం జరిగిన సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలు, అంతకుముందు నారాయణఖేడ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై గులాబీ దండును కలవరపెడుతోంది. ఒక వైపు సీఎం కేసీఆర్ పోలీసులు కోరినన్ని నిధులిచ్చి, వారికి అవసరమైన మౌలిక వసతుల కల్పించే పనిలో ఉండగా... ఆయన సొంత జిల్లాలోనే పోలీసులు టీఆర్‌ఎస్ పతనం కోసం ప్రయత్నించే పని చేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల అనంతరం మంత్రి హరీశ్‌రావు ఓటింగ్ తీరుపై పార్టీ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించగా.... హోరాహోరి పోరు సాగిన వార్డుల్లో పోలీసులు వివక్ష పూరితంగా వ్యవహరించి, విపక్షాలకు సహకరించారని పలువురు అభ్యర్థులు హరీశ్ ముందు తమగోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటున్నా.... పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించడానికి ప్రయత్నించారని, కావాలనే పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారని ముగ్గురు అభ్యర్థులు మంత్రికి చెప్పుకొని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించలేదని వారు వాపోయినట్టు సమాచారం.
మనోడు అనుకున్నోడే..
మంత్రి కనుసన్నల్లో పని చేస్తున్నాడనే ముద్రపడ్డ ఓ సీఐ స్థాయి అధికారి వైఖరిలో ఒక్కసారిగా మార్పు కన్పించింది. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో సదరు అధికారి ఒక్కసారిగా జూలు విదిల్చడం గులాబీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. 14వ వార్డులో పోలింగ్ కేంద్రానికి దాదాపు 150 మీటర్ల దూరంలో నిలబడిన ఓ మహిళ నాయకురాలిని సదరు అధికారి పరుష పదజాలంతో తిట్టడంతో తోటి మహిళలను తలదించుకునేలా చేసింది. ‘ఓటు వేయడానికి వస్తే... ఆ పోలీసోడు చెప్పుకోలేని మాటలన్నడు.. ఆయన తల్లీ, ఈ జిల్లా ఎస్పీ కూడా ఆడదే అని.. మదమెక్కిన ఆ పోలీసుకు తెల్వదా’ అని ఘాటుగానే ప్రతిస్పందించారని ఓ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. పార్టీ నాయకుల ఫిర్యాదులు విన్న మంత్రి హరీశ్‌రావు ‘ఈ పోలీసు యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్నది ఎవరు?’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఇక్కడే బీజం పడింది..
నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీసుల తీరును బాహాటంగానే ఎండగట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అయితే ‘మేం ఉప ఎన్నికల్లో పోటీ చేయడం పోలీసులకు ఇష్టం లేదా?’ అని నేరుగానే ప్రశ్నించారు. ఇదే ఉప ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఓ గ్రామంలో అక్రమంగా దాచిన డబ్బు పోలీసులకు పట్టుబడినా... కావాలని పోలీసులు ఆ వివరాలను గోప్యంగా ఉంచారని, చివరకు మీడియా ఒత్తిడితో అసంపూర్తి వివరాలను మాత్రమే బయట పెట్టారని, ఓ ఉన్నతాధికారి ఆదేశం మేరకే టీఆర్‌ఎస్ మెజార్టీని తగ్గించడానికే పోలీసులు ప్రయత్నం చేశారని టీఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది.
డీజీపీ పర్యటనతో మరింత...
ఖేడ్‌లో మొదలైన విభేదాలకు డీజీపీ అనురాగ్‌శర్మ జిల్లా పర్యటన మరింత ఆజ్యం పోసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధుల తో నిర్మించిన చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన, లాల్‌సింగ్ తండా ఫైరింగ్ రేంజ్ ప్రాంతానికి భూమి పూజ, జహీరాబాద్ రిసెప్షన్ భవనం, సంగారెడ్డి సీసీ టీవీ కమాండింగ్ కేంద్రాలను ఇటీవల డీజీపీ ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి కనీస సమాచారం లేకుండా ఏకపక్ష కార్యక్రమాన్ని కొనసాగించడంపై స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ పోలీసులు వ్యవహరించిన తీరుతో విభేదాలు మరింత ప్రస్పృటమయ్యాయి. తారస్థాయికి చేరిన ఈ విభేదాలు ఏ రకంగా సమసిపోతాయో చూడాలి మరి.