![Father Brutally Chops His Sleeping Son To Death With An axe - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/10/444_0.jpg.webp?itok=gvMjiNUa)
వీరులపాడు (నందిగామ): నిద్రిస్తున్న కుమారుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ తండ్రి. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కథనం మేరకు.. మండల కేంద్రమైన వీరులపాడు గ్రామానికి చెందిన బొల్లెద్దు గాబ్రియేలు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గాబ్రియేల్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలయ్యాయి. గాబ్రియేల్ భార్య మృతి చెందటంతో 2007లో తిరుపతమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసి పెయింటింగ్ పనులు చేస్తున్న కుమారుడు కిరణ్‌తో కలిసి గాబ్రియేల్ దంపతులు ఉంటున్నారు.
అయితే తిరుపతమ్మ, కిరణ్ మధ్య తరచూ వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారం రోజులుగా కిరణ్‌ను ఇంట్లో నుంచి పంపించాలని గాబ్రియేల్‌ను తిరుపతమ్మ వత్తిడి చేస్తోంది. ఈ విషయమై తిరుపతమ్మ, కిరణ్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కిరణ్ ఉన్న ఇంట్లో తాను ఉండనని భర్తకు చెప్పి ఆమె పుట్టింటికి వెళ్లింది. అదే రోజు రాత్రి గాబ్రియేలు కూడా ఇంటి నుంచి వెళ్లిపోవాలని చెప్పగా, ఇల్లు తనదని, తాను వెళ్లాల్సినవసరం లేదని కిరణ్ గట్టిగా చెప్పాడు.
ఇది మనసులో పెట్టుకున్న గాబ్రియేలు శనివారం తెల్లవారుఝామున 5.30 గంటల సమయంలో నిద్రపోతున్న కిరణ్ మెడపై గొడ్డలితో కిరాతంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు వీరులపాడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలాన్ని నందిగామ రూరల్ సీఐ ఐ.వి.నాగేంద్రకుమార్‌తో కలిసి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
(చదవండి: వీడియో కాల్‌తో వివాహితకు వేధింపులు)
Comments
Please login to add a commentAdd a comment