పుష్కర సేవలో నాలుగో సింహం
బీచుపల్లి ఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: ‘మీరు ఎక్కడి వెళ్లాలి.. ఘాట్‌లోకి అయితే ఇలా వెళ్లండి.. పార్కింగ్‌కు అయితే ఇలా.. బస్టాండ్‌కు అయితే ఇలా వెళ్లండి’ అంటూ ఎప్పటికప్పుడు సూచనలు.. సలహాలు ఇస్తూ భక్తులకు సమాచారం ఇవ్వడంతో పాటు వారికి సహకరిస్తున్నారు. కృష్ణా పుష్కరాలలో పోలీస్ శాఖలో ఎస్పీ స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ భక్తుల సేవలో పాల్గొంటున్నారు. జిల్లాలో 185కిలోమీటర్ల జాతీయ రహదారిపై పోలీసులు పహారా ఉంది. ప్రతి 10అడుగులకు ఓ హోంగార్డు, ఓ కానిస్టేబుల్ చొప్పున అనుక్షణం అప్రమత్తంగా ఉండి, విధులు నిర్వహిస్తుండటంతో భక్తులు సాఫీగా పుష్కరయాత్ర పూర్తి చేసుకుంటున్నారు.
రోడ్లు దాటిస్తున్నాం
పుష్కరాల కోసం హైదరాబాద్ వైపు నుంచి వేలమంది భక్తులు వస్తున్నారు. అలాంటి వాళ్లను ప్రత్యేకంగా రోడ్డు దాటించడం కోసం పని చేస్తున్నాను. రోజుకు కొన్ని వేల మందిని ఈ రోడ్డు అవతల వైపునకు వాహనాలు ఆపుతూ పంపిస్తున్నా. రోడ్డుకు ఇరువైపుల నడుస్తున్న భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మైక్ ద్వారా ఘాట్ల సమాచారం ఇస్తున్నాం.
–సీతయ్య, సీఐ
భక్తులకు సమాచారం ఇస్తూ..
కృష్ణా పుష్కరాలలో భాగంగా జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పూర్తిగా పెరిగిపోవడంతో కొంత ఇబ్బందులు ఉంటాయి. అయిన వాటన్నింటినీ ఎదుర్కొంటూ భక్తులకు అవసరం అయిన సమాచారం ఇస్తూ ముందుకు పంపిస్తున్నాం. వాళ్లను రోడ్డు పక్కన ఉండకుండా ఎప్పటికప్పుడు క్యూలైన్‌కు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
– గిరిబాబు, సీఐ
చాలామందికి తెలియడం లేదు
పుష్కరాల కోసం వచ్చే భక్తులకు చాలా మందికి రోడ్డు మార్గాలపై అవగాహన ఉండదు. ఎక్కడ వాహనం నిలపాలి అనే విషయం వారికి స్పష్టత లేదు. అలాంటి వాహనదారులను ఎప్పటికప్పుడు విషయం చెబుతూ ముందుకు పంపిస్తాం. రోడ్డుపై విధులు నిర్వహించడం చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం.
–రామకృష్ణ, సీఐ
భయపడే వాళ్లకు సహకారం
చాలామంది ఇలాంటి రద్దీ రోడ్లు అవతలి వైపు వెళ్లాలంటే వేగంగా వస్తున్న వాహనాలను చూసి చాలా భయపడుతుంటారు. ఇలాంటి వాళ్లను ప్రత్యేకంగా ఎక్కువ మందిని తయారు చేసి రోడ్లు దాటిస్తున్నాం. అటు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా ఇటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా అవసరం జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
–శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ