రాయ‘బేరా’లు
- టీడీపీ నేతల ప్రలోభాలు
- ఊపందుకున్న క్యాంపు రాజకీయాలు
- ఊటీ, గోవాలకు తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం
- అయినా ఓటు వేస్తారా లేదా అని అనుమానం
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారపార్టీలో టెన్షన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అరకొర బలం..అయినా గెలవాలనే సంకల్పం..టీడీపీ నేతలను అడ్డదారి తొక్కిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత..రచ్చకెక్కిన విభేదాలు.. ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మంత్రులు..పార్టీ సీనియర్ నేతలు..రంగంలోకి దిగినా ఫలితం ఉండడం లేదు. బుజ్జగింపులు.. బెదిరింపులు.. తాయిలాలు..సామదానదండోపాయాలు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అధికార పార్టీలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. క్యాంప్ రాజకీయాలూ షురూ అయ్యాయి. ఓటమి భయం ఆ పార్టీ నేతలను వెన్నాడుతోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పార్టీలో టెన్షన్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపాలని రంగం సిద్ధం చేసింది. ఊటీ, గోవా తదితర ప్రాంతాలకు ఎంటీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను, కౌన్సిలర్లను తరలించాలని ప్రణాళికలు వేస్తోంది. క్యాంపులకు తరలించినప్పటికీ తమకు ఓటు వేస్తారా లేదా అనే అనుమానం అధికారపార్టీని వెన్నాడుతోంది.
ఈ నేపథ్యంలో ఓటు వేసే ముందు చూపించి వేయాలని ఏకంగా మంత్రులు కూడా ఆదేశాలు జారీచేయడం ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనకు అద్దం పడుతోంది. అయితే ఓటు చూపించి వేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ కేవలం ఓటర్లను భయపెట్టేందుకే అధికారపార్టీ ఈ రాజకీయానికి తెరలేపినట్టు తెలుస్తోంది. మరోవైపు శిల్పా చక్రపాణిరెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంతో ఆయన వ్యతిరేక వర్గం సహకరిస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది. మొత్తం మీద అధికారపార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు గుబులు రేపుతున్నాయి.
బేరసారాలు షురూ...!
అధికార దౌర్జన్యంతో పాటు ఆర్థిక బలంతో గెలిచేందుకు అధికారపార్టీ సిద్ధమవుతోంది. తమకు ఓటు వేయకపోతే ఇబ్బందులు తప్పవని బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఓటుకు ఇంత మొత్తం చొప్పున ఇచ్చేందుకు కూడా బేరసారాలు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి పూర్తిస్థాయిలో గెలిచేందుకు అవసరమైన మెజార్టీ ఉంది. అయితే, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా డబ్బు బలంతో ఎన్నికలను గెలవాలనేది అధికారపార్టీ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఓటుకు ఇంత మొత్తం అంటూ ఇవ్వడంతో పాటు క్యాంపులకు కూడా తరలించాలని నిర్ణయించింది. ఈ వారంలో ప్రత్యేక బస్సుల్లో క్యాంపులకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధమయ్యింది. ప్రధానంగా తమకు ఓటు వేస్తారో లేదో అనే అనుమానం ఉన్న నియోజకవర్గాలపై అధికారపార్టీ దృష్టి సారించిందని సమాచారం. అయినప్పటికీ తమకు ఓటు వేస్తారో లేదా అనే అనుమానం మాత్రం ఆ పార్టీని వేధిస్తోంది. అంతేకాకుండా జిల్లా పరిషత్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న తెలుగుదేశంపార్టీకి ఓటు ఎలా వేస్తామని స్వయంగా అధికారపార్టీలో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
వైఎస్‌ఆర్‌సీపీకి ఆధిక్యం
వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధికత్య ఉంది. అయితే, ఓటుకు నోటు తరహాలో అనేక మందిని అధికారపార్టీ అక్రమంగా అక్కున చేర్చుకుంది. తాము పార్టీ మారినప్పటికీ ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని సదరు నేతలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమను గెలిపించిన పార్టీకి ఓటు వేసి రుణం తీసుకోవాలని భావిస్తున్నారు. వైస్‌ఆర్‌సీపీకి 30 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా, ఎంపీటీసీ సభ్యులు 395 మంది ఉన్నారు. కౌన్సిలర్లల్లో కూడా వైఎస్‌ఆర్‌సీపీకే మెజార్టీ ఉంది. కాంగ్రెస్‌తో పాటు వామపక్ష సభ్యులు కూడా వైస్‌ఆర్‌సీపీకే మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు గత రెండేళ్లుగా ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణి రెడ్డి ఏమీ చేయలేదనే అపవాదు ఉంది. ఇది కూడా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డికి కలిసి వస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
-
ఎంపీటీసీలు మొత్తం 815 కాగా ఇందులో ఒకరు డిస్–క్వాలిఫై అయ్యారు. మిగిలిన 814 మందిలోనూ వివిధ కారణాలతో (మరణించడం వగైరా) ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య 804 మంది మాత్రమే ఉన్నారు.
-
కౌన్సిలర్లు 218 మందిలో వైసీపీకి 110 మంది బలం ఉంది.
-
ఇక నంద్యాల ఎంపీతో పాటు 8 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంది.