పంజగుట్ట: రాజకీయ జోక్యమే నయీంను పెంచి పోషించిందని,ఈ కేసునుహైకోర్టు చీఫ్ జస్టిస్‌చే విచారణ జరపాలని పలువురు పేర్కొన్నారు. ఆది వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చిక్కుడు ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక ఉద్యమకారుడు సాంబశివరావు (ఉసా) మాట్లాడుతూ.. గతంలో చట్టం, రాజ్యాంగం, ప్రభుత్వ పరిధిలో నేరస్తులకు శిక్షవిధించేదని, ప్రస్తుతం బూటకపు ఎన్‌కౌంటర్లు అనే విచ్చిన్నకర కార్యక్రమాలు చంద్రబాబు సృష్టించాడన్నారు.
గ్రేహౌండ్స్‌ను ఎలా తయారు చేశారో అందుకు సమాంతరంగా నయీంను కూడా అలానే తయారు చేశారని ఆరోపిచారు. ప్రజా ఉద్యమకారులను మట్టుబెట్టేందుకు 10 శాతం గ్రేహౌండ్స్ సిబ్బందిని నయీం గ్యాంగ్‌లో ఉంచారని ఆరోపించారు. సీపీఐ నాయకురాలు పశ్య పద్మ మాట్లాడుతూ.. కేవలం నయీం ఆస్తులు, స్థలాలపైనే విచారణ జరుగుతోందని, అతను హత్యలు చేసిన కుటుంబాల ఆవేదనను ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, పౌరహక్కుల సంఘం నాయకుడు నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.